దాచాలంటే దాగదులే!

17 Jul, 2019 12:58 IST|Sakshi
నిందితులు అబ్దుల్‌ ఖవీ, షేక్‌ సాలమ్‌

మూడేళ్లకు కొలిక్కి వచ్చిన హత్య కేసు

ఛేదించిన సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

ఇద్దరు నిందితుల అరెస్టు

సాక్షి, సిటీబ్యూరో: కుటుంబ కలహాల నేపథ్యంలో సమీప బంధువును మూడేళ్ల క్రితం హతమార్చారు... పహాడీషరీఫ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి హత్యగా నమోదైన ఆ కేసులో కనీసం హతుడు ఎవరనేది తేలకుండానే మూతపడింది. దాదాపు మూడేళ్ల అనంతరం ఇటీవల సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు అందిన సమాచారంతో కేసు కొలిక్కి వచ్చింది. ఈ దారుణ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్‌ మంగళవారం వెల్లడించారు. తాండూర్‌లోని ఇందిరానగర్‌కు చెందిన షేక్‌ వహీద్‌ వృత్తిరీత్యా వెల్డర్‌. ఇతడు 2007లో నగరానికి చెందిన సుల్తానా బేగంను వివాహం చేసుకున్నాడు. అనంతరం భార్యతో సహా నగరానికి వలసవచ్చి చంద్రాయణగుట్ట ప్రాంతంలో స్థిరపడ్డాడు. అనంతరం మద్యానికి బానిసైన వహీద్‌ భార్య, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. తరచూ ఆమెతో గొడవ పడటం, వేధించడంతో పాటు ఇంటి ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు.

దీంతో తనతో పాటు పిల్లల ఆకలి తీర్చేందుకు సుల్తానా బంధువులతో పాటు చుట్టు పక్కల వారిపై ఆధారపడేది. ఆమె బంధువులు కూడా తన ఇంటికి రావడానికి ఇష్టపడని వహీద్‌ అలా వచ్చిన వారిని దుర్భాషలాడేవాడు. దీంతో కొన్నాళ్లకు అందరూ రావడం మానుకోవడంతో ఆ కుటుంబం ఒంటరిదైంది. హఠాత్తుగా ఎక్కడికో వెళ్లిపోయే వహీద్‌ కనీసం భార్యకు కూడా సమాచారం లేకుండా వారాల తరబడి బయటే గడిపేవాడు. దీంతో సుల్తానా తన ఇబ్బందులను సోదరుడు అబ్దుల్‌ ఖవీతో పాటు తన సోదరి భర్త షేక్‌ సాలమ్‌కు చెప్పుకుని బాధపడింది. వహీద్‌ వైఖరి కారణంగా తమ పరువు పోతోందని, సుల్తానా తీవ్ర ఇబ్బందులు పడుతుందని భావించిన ఖవీ, సాలమ్‌ పలుమార్లు వహీద్‌కు కౌన్సిలింగ్‌ చేశారు. అయినా అతడిలో మార్పు రాకపోవడంతో హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా 2016 ఆగస్టు 12 రాత్రి వహీద్‌ ఒక్కడే ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుని ఆటోలో అక్కడికి వెళ్లారు. మద్యం తాగుదామంటూ అతడిని నమ్మించి తమతో పాటు ఆటోలో మామిడిపల్లి గ్రామం వైపు తీసుకువెళ్లారు. దారిలోనే పెట్రోల్‌ సైతం కొనుక్కుని వెళ్లారు. మామిడిపల్లి గ్రామ శివార్లలోని నిర్మానుష్య ప్రాంతానికి వహీద్‌కు తీసుకువెళ్ళిన వారు కర్రతో అతడి తలపై దాడి చేసి ఆపై ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు.

అనంతరం మృతదేహంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఈ హత్య విషయం కనీసం కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా ఇద్దరూ జాగ్రత్తలు తీసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పహాడీషరీఫ్‌ పోలీసులు అప్ప ట్లో ఘటనాస్థలికి సందర్శించారు. అయితే హతుడు ఎవరన్నది తెలియకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి హత్యగా కేసు నమోదు చేశారు. హతుడిని సైతం గుర్తించలేకపోవడంతో ఈ కేసు మూతపడింది. ఇటీవల సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వహీద్‌ హత్యపై సమాచారం అందడంతో ఇన్‌స్పెక్టర్‌ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎన్‌.శ్రీశైలం, కేఎన్‌ ప్రసాద్‌వర్మ, వి.నరేందర్, మహ్మద్‌ ఫక్రుద్దీన్‌ రంగంలోకి దిగారు. ఖవీ, సాలంలను అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరం అంగీకరించడంతో నిందితుతులను అరెస్ట్‌ చేసి పహాడీషరీఫ్‌ పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు