ఆ ప్రాణం ఖరీదు రూ.2,500..!

6 Dec, 2019 12:15 IST|Sakshi
రిజ్వాన్‌ అరెస్ట్‌ చూపుతున్న సీఐ, ఎస్‌ఐ

హత్యకు దారి తీసిన అద్దె గది అడ్వాన్స్‌ గొడవ

కేసును ఛేదించిన పాకాల పోలీసులు

నిందితులు ఒడిశా, తిరుపతి వాసులు

పాకాల: హత్య కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 22న స్థానిక చాండీచౌక్‌ వద్ద రైలు పట్టాలపై ఓ యువకుడి మృతదేహం వెలుగులోకి రావడం విది తమే. గురువారం సీఐ ఆశీర్వాదం తన కార్యాలయంలో మీడియాకు తెలిపిన వివరాలు.. బిహార్‌ రాష్ట్రం గోపాల్‌గంజ్‌ జిల్లా ప్రతాపురం గ్రామానికి చెందిన కపిల్‌దేవ్‌ యాదవ్‌ కుమారుడు బీరూకుమార్‌ యాదవ్‌ (26) స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి ఎదురుగా ఉన్న పీఎస్‌ టెక్స్‌టైల్స్‌ మిద్దెపైన ఒడిశా రాష్ట్రం, రాయఘడ్‌ జిల్లా, ముదుకుపుడకు చెందిన దెబేంద్రబిబార్‌ అలియాస్‌ బాబి మొహంతి (17)తో కలసి గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. తాపీ మేస్త్రీ పనులు చేస్తూ జీవించేవాడు. అద్దెకు తీసుకున్న గదికి సంబంధించి ఓనర్‌కు అడ్వాన్సు రూ.5వేలను బీరూయాదవే ఇచ్చా డు.

అయితే దెబేంద్రబిబార్‌ తన వాటా అడ్వాన్స్‌ రూ.2,500 ఇవ్వకపోవడంతో తరచూ అతనిని నిలదీసేవాడు. దీంతో కక్ష పెంచుకున్న దెబేంద్ర, బీరూకుమార్‌ను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. సెంట్రింగ్‌ పనులు చేసే తన స్నేహితుడు, తిరుపతి నెహ్రూ నగర్‌కు చెందిన షేక్‌ రిజ్వాన్‌(23) సహకారం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో గత 22న రాత్రి గదిలో నిద్రిస్తున్న బీరూకుమార్‌ యాదవ్‌ను దేబేంద్ర, రిజ్వాన్‌తో కలసి చెక్కతో తలపై బలంగా కొట్టి హతమార్చారు. ఆపై, మృతదేహాన్ని చాండీచౌక్‌ వద్ద రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయారు. అయితే ఆ పట్టాల మీదుగా రైళ్లు వెళ్లకపోవడంతో మృతదేహం ఛిన్నాభిన్నం కాలేదు. పోలీసులు దర్యాప్తులో ఇదంతా వెల్లడైంది. ఈ నెల 5న సీఐ, పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్‌ సమీపాన ఓ ఇటుకల బట్టీ వద్ద నిందితులిద్దరినీ అరెస్ట్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రాజశేఖర్, పోలీసులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా