పక్కా ప్లాన్‌తో..

5 Dec, 2018 12:18 IST|Sakshi
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న రాజమహేంద్రవరం అడిషనల్‌ ఎస్పీ వైవీ రమణ కుమార్‌

అప్పులు తీర్చుకునేందుకే పినతల్లిపై ఘాతుకం

వృద్ధురాలి హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌

అతడు అప్పులపాలయ్యాడు. వాటిని ఎలా తీర్చాలని భావించాడు. అతడి కన్ను పినతల్లి ఒంటిపై ఉన్న బంగారంపై పడింది. అంతే ప్లాన్‌ సిద్ధం చేశాడు. ఆమె ఇంటికి వెళ్లి పక్కాగా అమలు చేశాడు. పినతల్లిని హతమార్చి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు తీసుకుని పరారయ్యాడు. ఈకేసును ప్రతిష్టాత్మంగా తీసుకున్న పోలీసుల దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

తూర్పుగోదావరి , రాజమహేంద్రవరం క్రైం: వ్యసనాలకు బానిసై, అప్పుల పాలై వాటిని తీర్చేందు పిన తల్లిని హత్య చేసి నగలు చోరీ చేసిన నిందితుడిని అర్బన్‌ జిల్లా క్రైం, ప్రకాష్‌ నగర్‌ పోలీస్‌లు సంయుక్త ఆధ్వర్యంలో అరెస్ట్‌ చేశారు. బుధవారం రాజమహేంద్రవరం పోలీస్‌ గెస్ట్‌ హౌస్‌లో అడిషనల్‌ ఎస్పీ వై.వి.రమణ కుమార్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం, నారాయణపురం ఎఫ్‌సీఐ గోడౌన్స్‌ పక్క వీధి, సైక్లోన్‌ కాలనీలో నివసిస్తున్న దేవాదుల శ్యామల(60) నవంబర్‌ 14న అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతురాలికి బావ కుమారుడైన ఇన్నీసుపేటకు చెందిన దేవాదుల నాగేశ్వరావు వృద్ధురాలిని హత్య చేశాడని తెలిపారు. అప్పులపాలైన అతడు తన పినతల్లి ఒంటరిగా నివశించడం, ఆమె ఒంటిపై బంగారు నగలు ఉండడంతో తన ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం కోసం ఆమెను హత్య చేసి నగలు చోరీ చేశాడని తెలిపారు.

నిందితుడు ఇంటర్‌ వరకు చదువుకొని ప్రైవేటు ఉద్యోగాలు చేశాడని, ఐదేళ్ల నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి అందులో నష్టపోయాడని తెలిపారు. వ్యసనాలకు బానిసైన నాగేశ్వరరావు సుమారు రూ.ఆరు లక్షల వరకు అప్పులు చేశాడని తెలిపారు. అప్పుల వారి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఎలాగైనా వాటిని తీర్చాలనే దురాశతో తన పిన్ని శ్యామల ఇంటికి వెళ్లాడన్నారు. చాలా కాలం తరువాత వెళ్లడంతో మృతురాలు శ్యామల ఆదరించి లోపలికి ఆహ్వానించి మంచినీళ్లు ఇచ్చిందని, ఆ గ్లాసు ఇంట్లో పెట్టేందుకు వెళుతున్న సమయంలో వెనుక వైపు నుంచి వృద్ధురాలి మెడను నొక్కి ఊపిరాడకుండా చేసి చపాతీలు తయారు చేసే కర్తతో తల వెనుక భాగంలో కొట్టడంతో ఆమె మృతి చెందిందని తెలిపారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు గాజులు 8, రాళ్ల బంగారు గాజులు రెండు, ఉంగరాలు మూడు, బంగారు నల్లపూసల దండ, ముత్యాలు, పగడాలు బంగారు గొలుసు, బంగారు సూత్రాలతో ఉన్న రెండు పేటల బంగారు నానుతాడు చోరీ చేశాడని తెలిపారు. చోరీ చేసిన 34 కాసుల బంగారు నగలు విలువ రూ.ఏడు లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం నగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

చిన్న కుమారుడు, కోడలు పక్కపోర్షన్లో ఉండగానే..
మృతురాలి చిన్న కుమారుడు, కోడలు పక్క పోర్షన్‌లో టీవీ చూస్తుండగా నిందితుడు ఇంట్లోకి ప్రవేశించి పథకం ప్రకారం ఆమె తలపై కర్రతో కొట్టి పీకనులిమి  హత్య చేసి బంగారు నగలతో పరారయ్యాడని తెలిపారు. ఈ కేసులో ఏవిధమైన ఆధారాలు లేకపోయినా రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీ డాక్టర్‌ షీమూషీ బాజ్‌పే, అడిషనల్‌ ఎస్పీ క్రైం వైవీ రమణ కుమార్‌ పర్యవేక్షణలో డీఎస్పీ క్రైం త్రినాథరావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి 15 రోజుల్లో కేసును ఛేదించారని తెలిపారు. ఈ కేసు దర్యాప్తు అధికారి పి. మురళీ కృష్ణారెడ్డి, త్రీటౌన్‌ క్రైం సీఐ వరప్రసాద్, సిబ్బంది హెచ్‌సీలు భద్రరావు, పెద్దిరాజు, కేవీవీ సత్యనారాయణ, పీసీలు మణికంఠ, బూరయ్య, శ్రీనివాస్, బషీర్, ఆలీ సహకరించారని తెలిపారు. విలేకరుల సమావేశంలో ప్రకాష్‌ నగర్‌ సీఐ బాజీలాల్‌ తదితరలు పాల్గొన్నారు. నింది తుడిని రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు