వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..

25 Jan, 2020 08:25 IST|Sakshi
షేక్‌ ఆసిఫ్‌ సౌజన్య..

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య

నిందితుల అరెస్ట్‌

దుండిగల్‌: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని పథకం ప్రకారం ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హత్య చేయించిన సంఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఏసీపీ నర్సింహరావు, సీఐ వెంకటేశం, ఎస్సై శేఖర్‌రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. మెదక్‌ జిల్లా, పాపన్నపేట మండలం, కుర్తివాడకు చెందిన ముక్కుట్ల యాదాగౌడ్‌ (35), సౌజన్య దంపతులు ఐదేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి చర్చి గాగిల్లాపూర్‌లో ఉంటున్నారు. యాదాగౌడ్‌ ఆటో ఫైనాన్స్‌లో పని చేస్తుండగా సౌజన్య గృహిణి. కాగా అదే ప్రాంతానికి చెందిన డీసీఎం డ్రైవర్‌ షేక్‌ ఆసిఫ్‌తో యాదాగౌడ్‌కు స్నేహం ఉంది. దీంతో అతను తరచు యదాగౌడ్‌ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో సౌజన్యకు అతడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలియడంతో యాదాగౌడ్‌ ఇద్దరినీ మందలించాడు. 

ప్రియుడిని రెచ్చగొట్టి..
యాదాగౌడ్‌ అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్న సౌజన్య ఆసిఫ్‌కు పలుమార్లు ఫోన్‌ చేసి భర్త తనను వేధిస్తున్నాడని, అతడి అడ్డుతొలగిస్తే ఇద్దరం సంతోషంగా ఉండవచ్చునని చెప్పింది. ఈ నెల 15న యాదాగౌడ్‌ ఇంటికి వచ్చిన ఆసిఫ్‌ పార్టీ చేసుకుందామని అతడిని చర్చి గాగిల్లాపూర్‌లోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల వద్దకు తీసుకెళ్లాడు. యాదాగౌడ్‌కు ఫుల్లుగా మద్యం తాగించిన ఆసిఫ్‌ కత్తితో దాడి చేసి అతడిని హత్య చేశాడు. అక్కడి నుంచి నేరుగా సౌజన్య వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. అయితే తన భర్తను హత్య చేసిన ఆసిఫ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సౌజన్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

విచారణలో నిజాలు వెలుగులోకి..
ఆసిఫ్‌ను  అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా సౌజన్య ప్రోద్భలంతోనే హత్య చేసినట్లు చెప్పాడు. ఆమెకు ఫోన్‌ కూడా తానే కొనిచ్చానని, నిత్యం దాని నుంచే ఇద్దరం మాట్లాడుకునే వారమని తెలిపాడు. అయితే సౌజన్య మాత్రం హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇంటికి వచ్చిన ప్రతిసారి ఆసిఫ్‌ వెకిలి చూపులు చూసేవాడని, ఈ విషయం తన భర్తకు చెప్పడంతో అతడిని మందలించినట్లు చెప్పింది. ఆసిఫ్‌ ఇచ్చిన ఫోన్‌ నంబర్‌ను దాచి మరో నంబర్‌ను పోలీసులకు ఇవ్వడంతో విచారణ ఆలస్యమైంది. మరోసారి ఆసిఫ్‌ను విచారించి పోలీసులు అతడు ఇచ్చిన ఫోన్‌ కాల్‌ డేటాను సేకరించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తరచూ అతనితో ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడడంతో పాటు భర్తను హత్య చేయాలని ప్రేరేపించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తండ్రి హత్యకు గురి కావడం, తల్లి జైలుకు వెళ్లడంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.

మరిన్ని వార్తలు