హత్యలకు దారితీస్తున్న వివాహేతర సంబంధాలు

11 Aug, 2019 08:31 IST|Sakshi
సంఘటన స్థలంలో వెంకట పద్మావతి మృతదేహం,  పద్మావతి అపస్మారక స్థితిలో సుబ్బారెడ్డి

సాక్షి, దుగ్గిరాల(గుంటూరు) : వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన శనివారం దుగ్గిరాలలో చోటుచేసుకోవడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండల కేంద్రంలోని చేన్నకేశవనగర్‌కు చెందిన చనుమోలు వెంకట పద్మావతికి (35)  కొద్ది సంవత్సరాల కిందట విజయవాడకు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. కుమారుడు పుట్టిన తరువాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తి విడిపోయారు. ఈ క్రమంలో స్వగ్రామం దుగ్గిరాల చేరుకుని బట్టల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తుంది. ఈ నేపథ్యంలో పెనుమూలి గ్రామానికి చెందిన భీమవరపు సుబ్బారెడ్డితో పరిచయం ఏర్పడింది. గత ఐదు సంవత్సరాలుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఏడాది నుంచి సుబ్బారెడ్డి పద్మావతిని వేధిస్తుండటంతో వివాహేతర సంబంధానికి నిరాకరించింది.

దీంతో సుబ్బారెడ్డి పద్మావతిని అక్రమ సంబంధం కొనసాగించాలని ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఏడు గంటల సమయంలో చెన్నకేశవనగర్‌లో పద్మావతి నివాసం ఉంటున్న ఇంటిపైకి వెళ్లాడు. ఇద్దరి మధ్య మాటలు పెరిగి ఒక్కసారిగా సుబ్బారెడ్డి తన వెంట తెచ్చుకున్న  సల్ఫస్‌ మాత్రలు (పసుపు బిళ్లలు) పద్మావతి నోట్లో బలవంతంగా వేశాడు. పెద్దగా శబ్ధం వినిపించడంతో గదిలో నిద్రపోతున్న పద్మావతి కుమారుడు హేమంత్‌ బయటకు వచ్చాడు. గుమ్మంలో పడిపోయిన తల్లిని చూసి పెద్దగా కేకలు వేశాడు. అక్కడే ఉన్న సుబ్బారెడ్డి ‘మీ అమ్మ నోట్లో సల్ఫస్‌ మాత్రలు వేసి చంపాను.. నిన్ను కూడా చంపేస్తానని’ హేమంత్‌ను బెదిరించాడు. 

దేహశుద్ధి చేసిన స్థానికులు...
అనంతరం తన  చేతిలో ఉన్న సల్ఫస్‌ మాత్రలు సుబ్బారెడ్డి మింగినట్లు హేమంత్‌ పోలీసులకు తెలిపాడు. సమీపంలోని బంధువులు అక్కడకు చేరుకుని సుబ్బారెడ్డిని చితకబాదడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు 108కు సమాచారం అందించడంతో సిబ్బంది అక్కడకు చేరుకుని పద్మావతిని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అపస్మారక స్థితికి చేరుకున్న సుబ్బారెడ్డిని 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం అక్కడ నుంచి తాడేపల్లిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం సుబ్బారెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సీఐ ఆశోక్‌ కుమార్, ఎస్‌ఐ అనిల్‌కుమార్‌రెడ్డి సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పద్మావతి మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాల వివరాలు సేకరించారు. మృతురాలి కుమారుడు హేమంత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మేకల కాపరి దారుణహత్య
బొల్లాపల్లి: మండలంలోని వెల్లటూరు గ్రామానికి చెందిన మేకల కాపరి అంకె ఏడుకొండలు (35) దారుణహత్యకు గురైన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. తల మొండెం వేర్వేరు ప్రదేశాల్లో ఉండటంతో రాయి, కొడవలితో హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. గ్రామానికి చెందిన అంకె ఏడుకొండలు, పాలపర్తి నాగయ్య మేకల కాపరులు. ఇద్దరూ కలిసి రోజూ మేకలను తోలుకొని సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి కాసేవారు. ఈ క్రమంలో నాగయ్య ఏడుకొండల భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని సమాచారం. దీంతో కొన్ని రోజుల నుంచి కొండలు, నాగయ్య మధ్య వివాదం నడుస్తోంది.

తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించి ఎలాగైనా ఏడుకొండలను హతమార్చాలని నాగయ్య భావించాడు. ఈ నేపథ్యంలోనే ఏడుకొండలను హత్య చేసేందుకు ప్రణాళిక రూపొందించాడు. శుక్రవారం మేకలు కాసేందుకు వెళ్లిన ఏడుకొండలను నాగయ్య దారుణంగా హత్య చేసి తల, మొండెం వేరు చేశాడు. మృతుడి సోదరుడు ముసలయ్య ఫిర్యాదు మేరకు నిందితుడు నాగయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పోలీసుల అదుపులో  ఉన్నట్లు సమాచారం.

హత్య జరిగిందిలా...
గ్రామానికి సమీపంలోని కొండ ప్రాంతానికి ఏడుకొండలు శుక్రవారం  మేకలను  తోలుకొని వెళ్లాడు. సాయంత్రం మేకలు  ఇంటికి తిరిగి వచ్చినా ఏడుకొండలు మాత్రం రాలేదు. అనుమానంతో కుటుంబ సభ్యులు,  గ్రామస్తులు  సమీపంలోని అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. సాగర్‌ కుడికాలువకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో  ఏడు కొండలు మృతదేహం కంటపడింది. సమాచారం మేరకు వినుకొండ రూరల్‌ సీఐ ఎం.సుబ్బారావు, బండ్లమోటు ఎస్సై వి.వెంకట్రావు సిబ్బందితో ఘటన ప్రాంతాన్ని సందర్శించారు.  మృతుడి మొండెం, తల వేర్వేరు ప్రదేశాల్లో పడి ఉండటం గుర్తించారు. శుక్రవారం రాత్రి సమయంలో నాగయ్య అటవీప్రాంతం నుంచి రావడాన్ని కొందరు గ్రామస్తులు గమనించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. మృతుడికి భార్య రమణ, కుమారుడు ఉన్నారు.

అనుమానాస్పదం కాదు..మధుది ముమ్మాటికీ హత్యే !
పిడుగురాళ్ల: పట్టణంలోని శ్రీనివాసకాలనీకి చెందిన మీసాల మధు (21) అనుమానాస్పదంగా మృతి చెందలేదని, ముమ్మాటికీ హత్యేనని మృతుడి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు పిడుగురాళ్ల పట్టణ పోలీస్‌స్టేషన్‌ వద్ద ప్రధాన రహదారిపై శనివారం ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరుడైన మైనింగ్‌ మాఫియా ప్రధాన నిందితుడు అంజిబాబు ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె కుమార్తెతో మధు వివాహతేర సంబంధం పెట్టుకున్నాడని సమాచారం. ఈ నేపథ్యంలోనే అంజిబాబు మ«ధుని హత్య చేయించాడని బంధువులు ఆరోపించారు.  

హత్య చేసి కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధు హత్య కేసులో ముగ్గురు కంటే ఎక్కువ మందే ఉన్నారని ఆరోపించారు. పోలీసులు విచారించి నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. సీఐ ఎ. సురేంద్రబాబు మాట్లాడుతూ కేసు విచారిస్తున్నామని తెలిపారు.  నిందితులు ఎంతటివారైనా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. సీఐ హామీతో మధు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయమై సీఐ సురేంద్రబాబును వివరణ కోరగా మధు మృతి పట్ల అనుమానాలున్నాయని, ఆ కోణంలో విచారిస్తామన్నారు. 

ప్రియురాలితో కలిసి భార్యపై హత్యాయత్నం
విజయపురిసౌత్‌ : ప్రియురాలితో కలిసి భార్యను హతమార్చేందుకు భర్త విఫలయత్నం చేసిన ఘటన విజయపురిసౌత్‌లో కలకలం రేపింది. ఎస్‌ఐ కె.పాల్‌రవీందర్‌ కథనం మేరకు.. మాచర్ల పట్టణంలోని 8వ వార్డు సెరీన్‌కాలనీకి చెందిన బత్తుల కళ్యాణ్‌ అదే వార్డులోని ఉప్పుతోళ్ళ రమాదేవితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. కళ్యాణ్‌ భార్య అరుణ వారికి అడ్డంకిగా ఉందని భావించాడు. ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ప్రియురాలు రమాదేవి తమ్ముడు స్నేహితుడైన ఆటోడ్రైవర్‌ శేషా సందీప్‌ను గుంటూరు నుంచి పిలిపించింది. కళ్యాణ్‌ విజయపురిసౌత్‌లోని సాగర్‌మాత దేవాలయంలో నిద్ర చేయాలని భార్య అరుణను సందీప్‌ ఆటోలో తీసుకుని వచ్చారు. రాత్రి బహిర్భూమికి వెళ్లాలి తోడురా అంటూ కళ్యాణ్‌ భార్యను పిలిచి దేవాలయ సమీపంలోని శ్మశానవాటిక వద్దకు తీసుకువచ్చాడు.


హత్యాయత్నానికి గురైన అరుణ

అదే సమయంలో అక్కడికి ప్రియురాలు రమాదేవి సందీప్‌ ఆటోలో అక్కడికి చేరుకుంది. ముగ్గురు కలిసి అరుణను బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని కాలువ కట్టపైనున్న పశువేముల బ్రిడ్జిపై నుంచి కుడికాలువలోకి తోసి పరారయ్యారు. అరుణకు స్వల్పంగా ఈత రావటంతో కాలువ గోడ పక్కగా నీటిలో ఈత కొట్టుకుంటూ అక్కడ సమీపంలోని కుడికాలువ ర్యాంప్‌ ద్వారా ఒడ్డుకు చేరుకుంది. కాలువ సమీంపలో ఉన్న పశువేముల గ్రామానికి Ðð వెళ్లి అక్కడి గ్రామస్తులను లేపి విషయం చెప్పింది. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.  అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. భర్త పరారీలో ఉండగా ప్రియురాలు రమాదేవి, ఆటోడ్రైవర్‌ సందీప్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. 

>
మరిన్ని వార్తలు