ఐదు వందల కోసం హత్య చేశారు

27 Oct, 2018 10:43 IST|Sakshi
నిందితులు బాబా, స్వామితో పోలీసులు

కామారెడ్డి క్రైం: చెత్త కుప్పల్లో పేపర్లు, ప్లాస్టిక్‌ డబ్బాలను ఏరుకుంటూ పాత ఇనుప సామాను దుకాణంలో విక్రయించగా వచ్చిన డబ్బులను పంచుకునే విషయంలో ముగ్గురి మధ్య తలెత్తిన వివాదం ఒకరి హత్యకు దారి తీసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సీఎస్‌ఐ చర్చి గ్రౌండ్‌లో గత నెల 26న జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్‌పీ లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. మెదక్‌ ప్రాంతానికి చెందిన సాయి(26) కొంతకాలంగా కామారెడ్డిలో ఉంటూ చెత్తకుప్పల్లో కాగితాలు, ప్లాస్టిక్‌ సామగ్రి ఏరుకుని జీవిస్తున్నాడు.

ఇందిరానగర్‌ కాలనీకి చెందిన షేక్‌బాబా, బీడీ వర్కర్స్‌ కాలనీకి చెందిన స్వామి, బతుకమ్మ కుంటకు చెందిన వాహిద్‌తో కలిసి నిత్యం చెత్తకుప్పల వెంబడి సామగ్రి ఏరుకుని పాత, ఇనుపసామాను దుకాణంలో విక్రయించేవారు. వచ్చిన డబ్బులను సమానంగా పంచుకునేవారు. ఇలా సెప్టెంబర్‌ 26న సాయి, బాబా, స్వామి కలిసి తాము సేకరించిన సామగ్రిని అమ్మగా రూ.1500 వచ్చాయి. డబ్బులు తీసుకుని ముగ్గురు కలిసి మద్యం సేవించారు. చర్చి గ్రౌండ్‌లోని ఓ చెట్టుకిం ద వంట చేసుకుని భోజనం చేశారు. ఈ క్రమంలో సాయికి డబ్బుల విషయంలో బాబా, స్వామిలతో వివాదం తలెత్తింది. అటుగా వచ్చిన వాహిద్‌ వారిని వారించి అక్కటి నుంచి పంపించివేశాడు. అదే రోజున రాత్రి మళ్లీ కలిసిన సాయి, స్వామి, బాబా మద్యం బాటిళ్లు తీసుకుని గ్రౌండ్‌లో కూ ర్చుని అర్ధరాత్రి వరకు సేవించారు.

సాయి రూ. 500 తనకు రావాలని కోరడంతో వారి మధ్య మళ్లీ ఘర్షణ మొదలైంది. బాబా, స్వామి కర్రలతో సాయిపై దాడి చేసి కొట్టా రు. దీంతో సాయి అక్కడికక్కడే చనిపోయాడు. నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. మరుసటి రోజు ఉదయాన్నే గ్రౌండ్‌లో పోలీసులు పరిశీలించి విచారించారు. వారి తోటి స్నేహితుడు వాహిద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి మేడ్చల్, ఇందల్‌వాయిల్లో తిరిగిన స్వామి, బాబా శుక్రవారం కామారెడ్డికి వచ్చినట్లు తెలుసుకున్న పోలీసులు రైల్వేస్టేషన్‌ వద్ద వారిని అరెస్ట్‌ చేశారు. విచారించగా నేరం అంగీకరించినట్లు డీఎస్‌పీ తెలిపారు. నిందితులను కోర్టుకు హాజరుపరుస్తున్నామన్నారు. పట్టణ ఎస్‌హెచ్‌ఓ రామక్రిష్ణ, ఎస్‌ఐలు రవికుమార్, మజార్‌అలీ, సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు