దురాశతో భార్యాభర్తల హత్య

17 Nov, 2019 03:53 IST|Sakshi
నిందితుడు దుర్గయ్య.. వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నాగేశ్వర్‌రావు

సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి.. 

నిందితుడి అరెస్టు  

ట్రాక్టర్‌ కిస్తీలు కట్టలేక దుశ్చర్య 

పెన్‌పహాడ్‌: ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా ట్రాక్టర్‌ పొందిన ఓ లబ్ధిదారుడు తనకు పరిచయం ఉన్న మరో వ్యక్తికి లక్ష రూపాయల గుడ్‌విల్‌ ఇవ్వాలన్న ఒప్పందం మేరకు దానిని ఇచ్చాడు. ట్రాక్టర్‌ తీసుకున్న వ్యక్తి సబ్సిడీ పోను మిగతా డబ్బును ఫైనాన్స్‌లో నెలనెలా కిస్తీల రూపంలో కట్టాల్సి ఉంది. కాగా, ట్రాక్టర్‌ తీసుకున్న వ్యక్తి.. అసలు లబ్ధిదారుడు చనిపోతే ఫైనాన్స్‌ రుణం మాఫీ అవుతుందన్న దురాలోచనతో మద్యంలో సైనెడ్‌ కలిపి ఇచ్చాడు. అది తాగిన భార్యాభర్తలు ఇద్దరూ చనిపోయారు.

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలంలో ఆలస్యంగా శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి కథనం ప్రకారం.. పెన్‌పహాడ్‌ మండలం మొర్సకుంటతండాలో ఈనెల 3న భార్యాభర్తలు లాల్‌సింగ్, లక్ష్మిలు అనుమానాస్పదస్థితిలో మృతిచెందగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించారు. ఈ కేసుపై పోలీసులు తండాలో విచారణ జరపగా ట్రాక్టర్‌ విషయం తెలిసింది. దీంతో లాల్‌సింగ్‌ వద్ద ట్రాక్టర్‌ తీసుకున్న అదే తండాకు చెందిన దుర్గయ్య అనే వ్యక్తిని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. 

కిస్తీలు కట్టలేక దురాలోచన..  
లాల్‌సింగ్‌కు ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా మంజూరైన ట్రాక్టర్‌ను గుడ్‌విల్‌కు తీసుకున్న పల్లపు దుర్గయ్య, సబ్సిడీపోను మిగతా డబ్బులకు సీఎన్‌హెచ్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌ అనే హైదరాబాద్‌ కంపెనీ ద్వారా రుణం తీసుకొని నెలవారీగా కిస్తులు చెల్లించడానికి అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. అయితే దుర్గయ్య వాయిదాల ప్రకారం డబ్బులు చెల్లించకపోవడంతో ఆ కంపెనీ వారు ట్రాక్టర్‌ కోసం పలుమార్లు తండాకు వచ్చారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుడు చనిపోయినట్లయితే రుణంమాఫీ అవుతుందనే దురాలోచనలతో లాల్‌సింగ్‌ను అంతమొందించాలని దుర్గయ్య పథకం పన్నాడు.

రోజూ మద్యం సేవించే అలవాటు ఉన్న లాల్‌సింగ్‌కు దుర్గయ్య ఈ నెల 3వ తేదీన మద్యం సీసాలో సైనెడ్‌ పౌడర్‌ కలిపి ఇచ్చాడు. లాల్‌సింగ్‌ ఇంటికి వెళ్లి భార్యతో కలసి ఆ మద్యాన్ని తాగాడు. దాంతో వారు దుర్మరణం చెందారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వర్‌రావు పర్యవేక్షణలో లోతుగా విచారణ చేసి దుర్గయ్యే వారిని చంపినట్లు ఆధారాలు సేకరించారు. నిందితుని అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు