అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేటలో దారుణ హత్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అశ్వారావుపేటకు చెందిన మడుపు పాపాచారి(60)ను, స్థానిక కాకతీయ గేట్ వద్దగల స్వగృహంలో దుండగులు శనివారం రాత్రి హత్య చేశారు. ఇది, ఆదివారం ఉదయం వెలుగు చూసింది. పాపాచారికి భార్య సీతామహాలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబీకులంతా ఇటీవల పుణెలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంటిలో పాపాచారి ఒంటరిగా ఉంటున్నాడు. పాపాచారి, తన ఇంటి ఆవరణలో రక్తపు మడుగులో విగతుడిగా ఉండడాన్ని ఆదివారం ఉదయం స్థానిక యువకుడొకరు గమనించాడు.
స్థానికంగా ఉంటున్న అతని సోదరుడికి సమాచారమిచ్చాడు. ఆయన అక్కడకు వచ్చి, పోలీసులతో చెప్పారు. మృతదేహాన్ని పాల్వంచ డీఎస్పీ మధుసూదనరావు, అశ్వారావుపేట సీఐ అబ్బయ్య, ఎస్ఐ వేల్పుల వెంకటేశ్వరరావు పరిశీలించారు. మృతుడు పాపాచారి సోదరుడు మడుపు వెంకటరమణ ఫిర్యాదుతో కేసును ఎస్ఐ నమోదు చేశారు. సీఐ దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు.
ఆ స్థలమే కారణమా...?!
హతుడు పాపాచారికి స్థానిక అంటెడర్స్ కాలనీ వద్ద 867 గజాల ఖాళీ స్థలం (వ్యవసాయ భూమి) ఉంది. దీనిని ఆనుకుని, బట్న చిట్టెమ్మ ఇల్లు ఉంది. ఆ స్థలాన్ని తమకు అమ్మాలని పాపాచారిపై చిట్టెమ్మతోపాటు ఆమె కుమారులు సుబ్బు అలియాస్ సుబ్రహ్మణ్యం, నాగశివ సోమేశ్వరరావు కొంతకాలంగా ఒత్తిడి తెస్తున్నారు. అమ్మేది లేదనని స్థల యజమాని పాపాచారి స్పష్టంగా చెప్పారు. కానీ, వారు వినలేదు. పది రోజుల క్రితం ఆయనను బెదిరించారు.
రెండు రోజుల కిందట, ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించారు. దీంతో, పోలీసులను పాపాచారి ఆశ్రయించాడు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఈ స్థలాన్ని జేసీబీతో చదును చేయించి, చుట్టూ ఫెన్సింగ్ వేయించాడు. ఈ పనులన్నీ ముగించుకుని రాత్రి 7.20 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతడి కదలికలపై హంతకులు నిఘా పెట్టినట్టుగా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. రాత్రి 8.25 గంటలకు పాపాచారి ఇంటి ముందున్న (దాబా హోటల్) వద్ద కారు పార్కింగ్ చేశారు. రాత్రి 11 గంటల సమయంలో ఒంటరిగా ఇంట్లోకి వెళ్తున్న పాపాచారిని అనుసరించారు. వెనుక నుంచి కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తలపై తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు.
చిట్టెమ్మ ఇంట్లోకి డాగ్ స్క్వాడ్
హత్య సమాచారం అందుకున్న వెంటనే హత్యాస్థలిని సీఐ అబ్బయ్య, ఎస్ఐ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. డాగ్ స్క్వాడ్, హత్య జరిగిన ప్రదేశం నుంచి నేరుగా బట్న చిట్టెమ్మ ఇంటికి వెళ్లింది. ఆ ఇంటి పక్కనున్న పూరి పాక వద్దకు, ఇంటి ఆవరణలోని బాత్రూం వద్దకు వెళ్లి ఆగిపోయింది. స్థలం విషయంలోనే ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.