ఫోన్‌కాలే పట్టిచ్చింది..

4 Apr, 2018 13:20 IST|Sakshi
శవపంచనామా నిర్వహిస్తున్న సీఐ శ్రీనివాస్‌ , యర్రంశెట్టి దేవి (ఫైల్‌ ఫొటో)

అదృశ్యమైన వివాహిత దేవి హత్య

16 రోజుల అనంతరం వెలుగు చూసిన హత్యోదంతం

నిందితుడిని పట్టించిన ఫోన్‌కాల్‌ డేటా

రాయవరం (మండపేట): ఫోన్‌కాల్‌ డేటా ఆధారంగా రాయవరం పోలీసులు హత్య కేసును ఛేదించారు. అదృశ్యమైన వివాహిత యర్రంశెట్టి దేవి అవివాహితుడి చేతిలో హత్యకు గురైన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. అదృశ్యం అనంతరం హత్యకు గురైన  తీరు, మిస్టరీని ఛేదించిన విధానాన్ని రాయవరం ఎస్సై వెలుగుల సురేష్‌ మంగళవారం విలేకరులకు తెలిపారు. ఆయన కథనం ప్రకారం..  
రాయవరం గ్రామానికి చెందిన యర్రంశెట్టి దుర్గాదేవి(40) గత నెల 18న సామర్లకోటలోని తన సోదరుడికి డబ్బులు ఇచ్చేందుకు బయలుదేరింది. అప్పటికే ఫోన్‌లో పరిచయమున్న రంగంపేట మండలం సింగంపల్లి గ్రామానికి చెందిన మురుకుర్తి వీరసుబ్రహ్మణ్యం దేవిని బిక్కవోలు మండలం బలభద్రపురంలో కలిశాడు.

ఆమెను మోటార్‌సైకిల్‌పై ఎక్కించుకుని సింగంపల్లిలోని తన పొలం వద్దకు తీసుకు వెళ్లాడు. శారీరకంగా కలిశాడు. రెండోసారి కలిసేందుకు దేవి అంగీకరించక పోవడంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో సుబ్రహ్మణ్యం దేవి చెంపపై బలంగా కొట్టడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేర్చితే విషయం బయటకు వస్తుందని భావించిన సుబ్రహ్మణ్యం తన వద్ద ఉన్న జేబురుమాలుతో దేవి మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న బంగారం, రూ.40వేల నగదును తీసుకుని మృతదేహాన్ని ప్లాస్టిక్‌ సంచిలో మూట కట్టాడు. మృతదేహంతో ఉన్న సంచిని బల్లాలమ్మ చెరువు వద్ద పంట పొలాలకు వెళ్లే తూములోకి నెట్టి ఇంటికి వచ్చేశాడు. 

16 రోజుల అనంతరం..
తన భార్య సామర్లకోట వెళ్లి రాకపోవడం..బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఫలితం లేక పోవడంతో గత నెల 25న దేవి భర్త వెంకట్రావు రాయవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన రాయవరం ఎస్సై వెలుగుల సురేష్‌ దేవి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ రావడంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఆమె ఫోన్‌కాల్‌ డేటాను సేకరించగా, చివరగా మురుకుర్తి వీరసుబ్రహ్మణం కాల్‌ ఉండడంతో దర్యాప్తు వేగవంతం చేశారు. ఎస్సై సురేష్‌ వీఆర్వోలు పలివెల అబ్బాయి, పైన నాగేశ్వరరావులను వెంట బెట్టుకుని వీరసుబ్రహ్మణం ఇంటికి సింగంపల్లి వెళ్లగా నిందితుడు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా, అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై సురేష్‌ విచారణ చేయగా దుర్గాదేవిని తానే హత్య చేసినట్టు మధ్యవర్తుల సమక్షంలో నేరం అంగీకరించిన సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని దాచిన ప్రదేశాన్ని పోలీసులకు చూపించాడు. తూములో దాచిన మృతదేహాన్ని బయటకు తీయగా, కుళ్లిన స్థితిలో ఉంది.

అనపర్తి సీఐ పాలా శ్రీనివాస్‌ సంఘటన స్థలికి చేరుకుని ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు చూపించారు. దుర్గాదేవిదేనని నిర్ధారించిన అనంతరం శవపంచనామా నిర్వహించి, మృతదేహాన్ని స్వాధీన పర్చుకున్నారు. శవ పరీక్ష చేసేందుకు పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు సమాచారం అందించారు.

హత్య కేసుగా మార్పు..
దుర్గాదేవి అదృశ్యం కేసును అనపర్తి సీఐ శ్రీనివాస్‌ పర్యవేక్షణలో హత్య కేసుగా మార్పు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేష్‌ తెలిపారు. నిందితుడు వీరసుబ్రహ్మణ్యంను అరెస్ట్‌ చేశామని, అనపర్తి మేజిస్ట్రేట్‌ ముందు నిందితుడిని హాజరు పరచనున్నట్టు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు