వీడిన గొర్రెల కాపరి హత్య మిస్టరీ

31 Oct, 2018 12:26 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సీఐ ప్రసాద్‌రావు, ఎస్‌ఐ రామాంజనేయులు

తమ్ముడే హంతకుడు

వివాహేతర సంబంధమే హత్యకు కారణం

అనంతపురం, గుంతకల్లు రూరల్‌: గుండాల గ్రామంలో ఈ నెల 25న జరిగిన గొర్రెల కాపరి ఎల్లిపాయల రాజు (32) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హతుడి తమ్ముడే నిందితుడని తేల్చారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందునే అన్నను కడతేర్చినట్లు తమ్ముడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఇందుకు సంబంధించిన వివరాలను కసాపురం పోలీస్‌స్టేషన్‌లో రూరల్‌ సీఐ ప్రసాద్‌రావు, ఎస్‌ఐ రామాంజనేయులు మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఎల్లిపాయల రాజు మద్యానికి బానిసై బాధ్యత మరిచి తిరిగేవాడు. ఏడాది కిందట కట్టుకున్న భార్యనే మట్టుబెట్టాడు. ఈ కేసులో కోర్టు వాయిదాలకు హాజరవుతున్నాడు.

ప్రస్తుతం తమ్ముడు శ్రీనివాసులుతో కలిసి రాజు గొర్రెలను మేపుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మరదలితో రాజు సన్నిహితంగా ఉంటుండేవాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసులు రగిలిపోయాడు. ఈ నెల 24న రాత్రి గ్రామ సమీపంలోని వంక వద్ద మద్యం తాగి బండపై పడుకుని ఉన్న రాజు వద్దకు వెళ్లాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అన్నతో గొడవపడ్డాడు. ఆగ్రహానికి గురైన శ్రీనివాసులు టవల్‌తో రాజు గొంతును బిగించి కిందపడేశాడు. అనంతరం గొంతుపై కాలితో నొక్కిపెడుతూ కొడవలితో నరికి, పక్కనే ఉన్న బండరాయితో తలపై మోది ప్రాణం తీశాడు. 25వ తేదీన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని వంక ప్రాంతంలో నిందితుడు శ్రీనివాసులు ఉన్నట్లు సమాచారం అందడంతో కసాపురం ఎస్‌ఐ తన సిబ్బందితో వెళ్లి అరెస్ట్‌ చేశారని సీఐ తెలిపారు. 

మరిన్ని వార్తలు