హత్యా? ప్రమాదమా?

27 Oct, 2018 14:18 IST|Sakshi
భార్య, కుమార్తెతో రాజేష్‌కుమార్‌(ఫైల్‌)

గండి వాటర్‌ వర్క్స్‌ సమీపంలో రాజేష్‌కుమార్‌ మృతదేహం

పథకం ప్రకారమే హత్యచేసి, ప్రమాదకర సంఘటనగా చిత్రీకరించారని బంధువుల ఆరోపణ

మృతదేహం బయటపడేవరకూ తెలుపని మేస్త్రీ

మృతుని భార్య, బంధువులకు బెదిరింపులు

కడప అర్బన్‌: కడప నగర శివారు చిన్నచౌక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి గండి వాటర్‌ వర్క్స్‌ సమీపంలో ఉరిమెళ్ల రాజేష్‌కుమార్‌(22) మృతి మిస్టరీగా మారింది. ఈ సంఘటనలో పలు అనుమానాలు చోటుచేసుకుంటున్నాయి. సంఘటనకు రాజేష్‌కుమార్‌ను తీసుకెళ్లిన మేస్త్రీ, మరో నలుగురు కారణం అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విశ్వసనీయవర్గాలు, బంధువుల ఆరోపణలు, చిన్నచౌక్‌ పోలీసుల

వివరాల మేరకు...
 చిన్నచౌక్‌ అశోక్‌ నగర్‌కు చెందిన శివకుమారి, తల్లిదండ్రులు లేని తన అక్క కుమారుడైన రాజేష్‌కుమార్‌(22)ను చేరదీసి, తనతోపాటు జీవనం సాగించేది. రాజేష్‌కుమార్‌ ఎర్రముక్కపల్లెకు చెందిన గిరినాగప్రసాద్‌ దగ్గర రాడ్‌బెండింగ్‌ పని చేసేవాడు. తన చిన్నమ్మకు, కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. 2016 జూన్‌ 15న అట్లూరు మండలం, వేమలూరుకు చెందిన కొండయ్య కుమార్తె మమతను వివాహం చేసుకున్నాడు. వీరికి రియా(1) సంతానం ఉంది. వివాహ సమయంలో రాజేష్‌కుమార్‌ మేస్త్రీ దగ్గర రూ.40వేలు అప్పుగా తీసుకున్నాడు. తన భార్య మమత ప్రసవానికి వెళ్లిన సమయంలో రాజేష్‌కుమార్, మేస్త్రీ మధ్య మనస్పర్థలు రావడంతో వాస్మోల్‌ సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చేరిన వెంటనే మేస్త్రీ వచ్చి, ఎలాంటి ఫిర్యాదులు చేయకుండానే రాజీకుదుర్చుకుని, ఇటీవల నాలుగు నెలల నుంచి మరలా తన దగ్గరే పనికి తీసుకెళ్లేవాడు. అంతేగాక ప్రస్తుతం తిలక్‌నగర్‌లో నెలరోజుల నుంచి తన భార్య, బిడ్డతో పాటు వేరుగా కాపురం ఉంటున్నాడు. ఈనెల 21న మేస్త్రీ గిరినాగప్రసాద్‌తో పాటు, డిన్నర్‌కు వెళుతున్నానని భార్యతో చెప్పాడు. సాయంత్రం అయినా భర్త రాకపోవడంతో ఫోన్‌ చేస్తే స్పందించలేదు. తర్వాత మేస్త్రీకి ఫోన్‌ చేస్తే, తమ ఇంటి వద్దకు వచ్చి, రాజేష్‌కుమార్‌ ఇక రాడని.. బెదిరించి వెళ్లినట్లు మమత ఆరోపించారు.

మంగళవారం సాయంత్రం మమత, తన చిన్నత్త శివకుమారి, తండ్రి కొండయ్యతో కలిసి చిన్నచౌక్‌ పోలీసులను ఆశ్రయించారు. రాజేష్‌కుమార్‌ సరదాగా తన మేస్త్రీతో పాటు ఆదివారం వెళ్లి తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం సాయంత్రం గండి వాటర్‌ వర్క్స్‌ సమీపంలో రాజేష్‌కుమార్‌ మృతదేహం బాగా ఉబ్బి బయటపడింది. సంఘటనా స్థలం వద్దే మృతదేహానికి రిమ్స్‌ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అనుమానాలెన్నో ...
రాజేష్‌కుమార్‌ మృతి సంఘటనపై పలు అనుమానాలు ఉన్నాయని అతని భార్య మమత, చిన్నమ్మ శివకుమారి, మామ కొండయ్య ఆరోపిస్తున్నారు. మేస్త్రీ తన దగ్గర పని చేస్తున్న రాజేష్‌ కుమార్‌ను ఆదివారం సరదాగా డిన్నర్‌కు పిలిచి, పథకం ప్రకారమే హత్య చేశారని చెబుతున్నారు. ఈతకు మేస్త్రీ రాజేష్‌తో పాటు, తన దగ్గర పనిచేస్తున్న వారినీ తీసుకుని వెళ్లారా? లేకుంటే వేరే వారిని తీసుకుని వెళ్లి మద్యం సేవింపజేసి నీళ్లలో ముంచివేసి, అనుమానం రాకుండా మట్టుపెట్టారా అంటూ అనుమానాలు ఉన్నాయన్నారు. రాజేష్‌కుమార్‌కు సంబంధించిన సెల్‌ఫోన్‌ మేస్త్రీ దగ్గరే ఎందుకు ఉందని ప్రశ్నించారు. మృతదేహం బయటపడిన చోట ఎలాంటి నీటిమట్టం లేకపోవడం గమనార్హం. ప్రవాహానికి మృతదేహం కొట్టుకుని వచ్చిందంటే తలపై ఎందుకు పెద్దగాయం ఉందని ప్రశ్నించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. మగ దిక్కును కోల్పోయామని కన్నీరుమున్నీరుగా రోదించారు.

చిన్నచౌక్‌ సీఐ వివరణ
ఈ సంఘటనపై చిన్నచౌక్‌ సిఐ ఎస్‌. పద్మనాభన్‌ మాట్లాడుతూ సమగ్రంగా విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. మృతదేహం నుంచి ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు కోసం అవసరమైన వాటిని సేకరించి పంపించామన్నారు. పూర్తి స్థాయి విచారణ చేస్తామని, నిజానిజాలు వెల్లడిస్తామన్నారు.

మరిన్ని వార్తలు