మృతదేహం కోసం అన్వేషణ

29 Jun, 2019 09:50 IST|Sakshi

సాక్షి, ఎర్రగుంట్ల(కడప) : మండల పరిధిలోని నిడుజివ్వి గ్రామ సమీపంలోని నాపరాయి గనులలో పూడ్చిన సగబాల రామాంజనేయుల (45) మృతదేహం ఆచుకీ కోసం శుక్రవారం ఎర్రగుంట్ల తహసీల్దార్‌ సుబ్రమణ్యం, ప్రొద్దుటూరు రూరల్‌ సీఐ ఎస్‌ విశ్వనాథ్‌రెడ్డిలు అన్వేషణ చేపట్టారు. అయితే ముద్దాయిలు తెలిపిన మేరకు మృతదేహం కోసం మూడు చోట్ల జేసీబీతో గుంతలు తీశారు. మృతదేహం ఆచూకి కన్పించలేదు. ఈ కేసుకు సంబంధించిన కేసు వివరాలను ప్రొద్దుటూరు రూరల్‌ సీఐ విశ్వనాథరెడ్డి తెలియజేశారు.  ఆయన మాట్లాడుతూ  ప్రొద్దుటూరులోని ఈశ్వరరెడ్డి నగర్‌ కాలనీకి చెందిన సగబాల రామాంజనేయులు అదే కాలనీకి చెందిన అంకన్న భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో అతడిని చంపడానికి ముగ్గురు వ్యక్తులు తలారీ నాగేశ్, నదేండ్ల మౌలాలి, రంగస్వామిలతో  ఒప్పందం కుదర్చుకున్నారు.

2017లో ఉగాది పండుగ సమయంలో అతడు అదృశ్యం అయ్యాడు. తర్వాత కుటుంబ సభ్యులు గాలింపులు చేసిన కన్పించకపోవడంతో అనుమానం వచ్చి 2018 నవంబరులో  ప్రొద్దుటూరు రూరల్‌ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. ఆ ఫిర్యాదు మేరకు అప్పుటి ఎస్‌ఐ కేసు నమోదు చేశారన్నారు. కేసు విచారణలో తలారీ నాగేశ్, నదేండ్ల మౌలాలి, రంగస్వామిలపై అనుమానంతో అరెస్టు చేశారు. రామాంజనేయులను చంపి నిడుజివ్వి గ్రామంలోని నాపరాయి గనులల్లో పూడ్చి చేసినట్లు వారు తెలిపారన్నారు. కోర్టు ప్రత్యేక అనుమతి తీసుకొని ఎర్రగుంట్ల తహసీల్దార్‌ సుబ్రమణ్యంతో కలసి పంచనామ కోసం నిడుజివ్వి గ్రామం పరి«ధిలోని ముద్దాయిలు తెలిపిన నాపరాయి గనుల్లో మూడు చోట్ల  తవ్వకాలు చేపట్టినట్లు తెలిపారు. అయినా మృతదేహం ఆచూకీ లభించలేదన్నారు.  కార్యక్రమంలో ప్రొద్దుటూరు రూరల్‌ ఎస్‌ఐ సునీల్‌రెడ్డి, వీఆర్‌లు, కానిస్టేబుల్స్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు