మూఢనమ్మకాలతో అఘాయిత్యాలు

9 Apr, 2018 13:03 IST|Sakshi
నిందితుల అరెస్టు (ఫైల్‌)

మంత్రాల నెపంతో హత్యల పరంపర

అక్షరాస్యత పెరిగినా వీడని అజ్ఞానం

పెద్దపల్లి:  ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా దొరా బాంచెన్‌ కాల్మొక్తా.. అనే ఫ్యూడల్‌ వ్యవస్థను ఎదురించింది. తెలంగాణ ఉద్యమంలో ముందుండి చరిత్ర సృష్టించింది. ప్రతి ఇంటా ఓ ఇంజనీర్‌ విద్యార్థి. వాడకో మెడికల్‌ విద్యార్థి. ఇంట్లో ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌. అరచేతిలో స్మార్ట్‌ ఫోన్‌. ప్రతి క్షణం గూగుల్‌ సెర్చ్‌. ఆలోచనలు మాత్రం పాతాళంలో. ఇంటి ముందు నిమ్మకాయలు, పసుపు కుంకుమ చూస్తే చాలు ఇంటి పక్కనున్న వారిపైనే అనుమానం. పిచ్చి ముదిరితే ఊరిలో ఉండే అమాయకులపై మంత్రగాళ్లంటూ అనుమానం. చివరికి హత్యల వరకు వెళ్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో గత కొన్నేళ్లుగా ఇలాంటి హత్యలు కొనసాగుతున్నాయి. మూడు రోజుల క్రితం జిల్లాలోని రామగిరి మండలం బేగంపేట సమీపంలోని పన్నూరు వద్ద దేవల్ల లక్ష్మి అనే వృద్ధురాలిని మంత్రాల నెపంతో హతమార్చారు. తాజాగా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి మూడు కి.మీ దూరంలో ఉన్న నిమ్మనపల్లిలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.

అజ్ఞానాన్ని దూరం చేయని అక్షరాస్యత
తెలంగాణలో అన్నింటా అభివృద్ధి చెందుతున్న వాటిలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పేరును ప్రథమంగా చెప్పుకోవచ్చు. అక్షరాస్యత ప్రస్తుతం 60శాతం దాటింది. కానీ గ్రామాల్లో మంత్రాల నెపంతో హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నిమ్మనపల్లి గ్రామంలో దంపతుల హత్య వెనక ఓ ఆసక్తి కరమైన కథ ఉంది. శంకర్‌ తన కూతురి పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పందిట్లోనే తూలిపోయాడు. దీంతో ఆ పెళ్లి రద్దయింది. ఇదంతా తన అన్నా, వదినలు చేసిన పన్నాగమేనంటూ పగ పెంచుకొని వారిని అంతమొందించినట్లు తెలుస్తోంది.

నాకు మంత్రాలు చేయండి
మంత్ర, తంత్రాలు పూర్తి బూటకం. మూఢ నమ్మకాలను వీడాలి. ఎవరికైనా దమ్ముంటే నాకు మంత్రాలు చేసి చూపించాలి. మంత్రాలతో నా నోటిమాట పడిపోవాలి. నా కాళ్లు చేతులు పడిపోవాలి. మంత్రాలున్నాయనే వారికి ఇదే నా సవాల్‌.– బండారి రాజలింగం, తక్కళ్లపల్లి

మరిన్ని వార్తలు