యూట్యూబ్‌ ఛానల్‌ గొడవ: మ్యూజిక్‌ కంపోజర్‌‌ హత్య

18 Jun, 2020 09:18 IST|Sakshi
ఆర్యన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా యూట్యూబ్‌ ఛానల్‌

న్యూఢిల్లీ : యూట్యూబ్‌ ఛానల్‌ విషయంలో ఏర్పడ్డ కక్ష భోజ్‌పురి మ్యూజిక్‌ కంపోజర్‌‌ ప్రాణం తీసింది. ఈ సంఘటన ఢిల్లీలోని ద్వారకలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీ, ద్వారకకు చెందిన భోజ్‌పురి మ్యూజిక్‌ కంపోజర్‌‌ ముఖేశ్‌ చౌదరి ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి సంతోష్‌, విక్కీలు పరిచయమయ్యారు. వీరిద్దరూ కూడా మ్యూజిక్‌ కంపోజర్లు అవ్వటంతో సన్నిహితంగా ఉండేవారు. ఓ రోజు సంతోష్‌ తమ యూట్యూబ్‌ ఛానల్‌( ఆర్యన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా)కు సంబంధించిన పాస్‌వర్డ్‌, యూజర్‌ ఐడీని ముఖేశ్‌‌తో షేర్‌ చేశాడు. కొద్దిరోజుల తర్వాత ఆ ఛానల్‌ యూట్యూబ్‌నుంచి డిలేట్‌ అయిపోయింది. తమ ఛానల్‌ డిలేట్‌ అవ్వటానికి ముఖేశ్‌ కారణమని భావించిన సంతోష్‌, విక్కీలు అతడిపై కక్ష కట్టారు. ఎలాగైనా అతడ్ని చంపి పగ తీర్చుకోవాలనుకున్నారు. ( పుట్టిన రోజు వేడుకని పిలిచి... )

వారం రోజుల క్రితం ముఖేశ్‌ స్టూడియోకు వెళ్లిన వారు అతడి చేతులు, కాళ్లు కట్టేసి గొంతు నులిమి చంపేశారు. అనంతరం ఓ బ్లాంకెట్‌లో శవాన్ని చుట్టి టేబుల్‌ కింద దాచేశారు. అనంతరం కొన్ని విలువైన వస్తువులతో అక్కడినుంచి పరరాయ్యారు. నాలుగు రోజుల తర్వాత స్టూడియోనుంచి దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్టూడియోలోని టేబుల్‌ కింద కుళ్లిన స్థితిలో ముఖేశ్‌ మృతదేహం కనిపించింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా సంతోష్‌, విక్కీలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. సంతోష్‌ తన కంటే పాపులర్‌ అయిపోతాడన్న అసూయ తోటే ముఖేశ్..‌ ఆర్యన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా యూట్యూబ్‌ ఛానల్‌ను డిలేట్‌ చేసినట్లు వారు తెలిపారు. ఛానల్‌ డిలేట్‌ అవ్వటం కారణంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని నిందితులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు