445 మంది చిన్నారుల ముఖాల్లో 'ముస్కాన్‌'!

1 Aug, 2019 14:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బాల కార్మికులను ప్రోత్సహిస్తున్న పలువురు దుకాణ యజమానులపై 7 కేసులు నమోదు

చిన్నారులకు స్కూల్ యూనిఫామ్,స్కూల్ బ్యాగ్, బుక్స్ ఇచ్చిన పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో జూలై 1 నుంచి నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్-5 వివరాలను నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం గత ఐదేళ్లుగా  ఏటా రెండు విడుతలుగా ఆపరేషన్‌ స్మైల్, ఆపరేషన్‌ ముస్కాన్‌ పేరుతో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది. అందులో భాగంగా నగరంలో జూలై 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్‌ ముస్కాన్‌5 పేరుతో అధికార యంత్రాంగం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. 

హైదరాబాద్ సిటీలో మొత్తం 17 టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఆపరేషన్ ముస్కాన్-5లో భాగంగా హైదరాబాద్లో మొత్తం 445 మంది వీధి బాలలు, బాల కార్మికులను అధికారులు కాపాడారు. వీరిలో 407 మంది బాలురు ఉండగా, 38మంది బాలికలు ఉన్నారు. పట్టుబడిన బాల కార్మికుల్లో 381 మంది చిన్నారులను గుర్తించి పునరావాస చర్యల్లో భాగంగా పోలీసులు వారిని తిరిగి తమ తల్లిదండ్రులకు అప్పగించారు. అంతేకాకుండా వారికి చదువుకోవడానికి స్కూల్‌ బ్యాగ్స్‌, బుక్స్‌ అందజేశారు, మరో 64 మంది చిన్నారులను రెస్క్యూ హోమ్ కు తరలించామని అధికారులు వివరించారు. పలువురు బాలురను సైదాబాద్ రెస్క్యూ హోమ్‌ కు, బాలికలను నింబోలిఅడ్డ రెస్క్యూ హోమ్‌ కు తరలించామని పేర్కొన్నారు.

రాజ్యాంగం ప్రకారం పద్నాలుగు సంవత్సరాల లోపు చిన్నారులతో పని చేయించడం చట్టరిత్యా నేరం. కార్మిక శాఖ అధికారులు చట్టవ్యతిరేకంగా బాల కార్మికులను పనిలో పెట్టుకున్నందుకు 7 కేసులు నమోదు చేసి 18 లక్షలకు పైగా జరిమానా వేశారు. కాగా జనవరిలో నిర్వహించిన ఆపకేషన్ స్మైల్లో భాగంగా 429మంది చిన్నారులను, ఆపరేషన్ స్మైల్లో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 874 మంది చిన్నారులను పోలీసులు సంరక్షించారు.

మరిన్ని వార్తలు