పండుగ ముందు విషాదం

22 Aug, 2018 06:43 IST|Sakshi
జయూద్‌ (ఫైల్‌ ఫొటో)

బక్రీద్‌ సందర్భంగా ఫొటోలు తీసుకునేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు

వారిలో సెల్ఫీ తీసుకుంటూ జోడుగుళ్ల పాలెం తీరంలో జయూద్‌ గల్లంతు

మిగిలిన ఇద్దరు సురక్షితం

సాగర్‌నగర్‌(విశాఖ తూర్పు): పండుగ ముందు రోజు విషాదం నెలకొంది. బక్రీద్‌ సందర్భంగా ఫొటోలు తీసుకునేందుకు వెళ్లిన వారిలో ఓ యుకుడు గల్లంతవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జోడుగుళ్లపాలెం సీతకొండ దిగువన గల నాచురాళ్లుపై సెల్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలుజారి 16 ఏళ్ల యువకుడు జయూద్‌ గల్లంతయ్యాడు. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆదర్శనగర్‌ పరిధి రవీంద్రనగర్‌కు చెందిన అన్నదమ్ములు జయూద్, జయాన్, వారి స్నేహితుడు మాజీన్‌ కలసి మంగళవారం సాయంత్రం సముద్ర తీరంలో ఫొటోలు తీసుకోవడానికి వెళ్లారు. సీతకొండ వ్యూ ఫాయింట్‌ కిందన నాచురాళ్లపై నిల్చొని కొన్ని ఫొటోలు తీసుకున్నారు.

వీరిలో జయూద్‌ కాస్త ముందుకు వెళ్లి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలు జారిపోయి సముద్రంలో పడిపోయాడు. వెంటనే అలల తాకిడికి లోనికి కొట్టుకుపోయాడు. ఈ విషయాన్ని గమనించిన జయాన్, మాజీన్‌ ఆందోళనకు గురై ఏడుస్తూ తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. వారు వెంటనే పోలీసులకు తెలియజేసి సముద్ర తీరానికి చేరుకున్నారు. దీంతో ఆరిలోవ సీఐ తిరుపతిరావు, ఎస్‌ఐ అప్పారావు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి గల్లంతైన జయూద్‌ కన్పించలేదని పోలీసులు పేర్కొన్నారు. స్థానికంగా ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న మహ్మద్‌ జబీర్‌కు జయూద్, జయాన్‌ కుమారులు. జయూద్‌ బాసర జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ తొలి సంవత్సరంగా చదువుతుండగా జయాన్‌ శ్రీనిధి మోడల్‌ స్కూళ్లో టెన్త్‌ క్లాస్‌ చదువుతున్నారు. వీళ్ల స్నేహితుడైన మరో విద్యార్థి మాజీన్‌ శ్రీనిధి స్కూల్‌లోనే తొమ్మిదో తరగతి చదువుతున్నట్టు పేర్కొన్నారు. బక్రీద్‌ పండుగ సందర్భంగా ఇలాంటి విషాదం జరగడంతో జయూద్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గతంలో ఇదే స్థలంలో సెల్ఫీలు తీసుకుంటూ ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు ఇక్కడ ముగ్గురు యువకులు గల్లంతుయ్యారు. అయినా పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయక పోవడం విచారకరమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

యువతిని కాపాడిన లైఫ్‌ గార్డ్స్‌
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): సముద్ర అలల తాకిడికి ప్రమాదానికి గురైన యువతిని లైఫ్‌గార్డ్స్‌ కాపాడారు. మెరైన్‌ సీఐ వి.శ్రీనివాస రావు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన బి.మీనాక్షి తీరంలో అలల తాకిడికి లోనికి వెళ్లిపోయింది. వెంటనే గుర్తించిన లైఫ్‌గార్డ్స్‌ రంగంలోకి దిగి ఆమెను సురక్షితంగా రక్షించారు. ప్రథమ చికిత్స అనంతరం మీనాక్షిని ఆమె తండ్రికి అప్పగించారు. మెరైన్‌ ఏఎస్‌ఐ కుమార్, పోలీసులు కనకరాజు, లైఫ్‌ గార్డ్స్‌ లక్ష్మణ్‌ ఆమెను రక్షించారు.

మరిన్ని వార్తలు