పశువులను దొంగిలించారని పైశాచికం

14 Jun, 2018 09:25 IST|Sakshi

సాక్షి, రాంచీ : జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. పశువులను దొంగిలించారనే అనుమానంతో ఇద్దరు ముస్లింలను గ్రామస్థులు కొట్టి చంపారు. గొద్దా జిల్లాలోని దుల్లు గ్రామంలో బుధవారం రాత్రి మున్షి ముర్ము ఇంటి నుంచి అయిదుగురు వ్యక్తులు బర్రెలను దొంగిలించారనే అనుమానంతో గ్రామస్థులు వారిపై దాడి చేసిన ఘటన వెలుగుచూసిందని డీఐజీ అఖిలేష్‌ కుమార్‌ ఝా చెప్పారు.బర్రెలు కనిపించకపోవడంతో ముర్ముతో పాటు ఇతర గ్రామస్థులు అయిదుగురు వ్యక్తుల కోసం గాలించగా గురువారం తెల్లవారుజామున సమీప బంటకి గ్రామంలో వారిని గుర్తించారు.

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు సిరాబుద్దీన్‌ అన్సారి (35), ముర్తజా అన్సారీ(30)లను చావబాదారు. మిగిలిన ముగ్గురు తప్పించుకుని పారిపోయారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సంబంధించి ముర్ముతో పాటు నలుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. కాగా బాధితులు ఇదే జిల్లాకు చెందిన తలిజారి గ్రామస్తులని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతల పర్యవేక్షణకు గ్రామంలో పోలీస్‌ పికెట్‌ను ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు