వ్యాపారి హత్య బంగారం కోసమేనా?

10 Jul, 2019 07:28 IST|Sakshi
నందచెరువు సమీపంలో నాగేశ్వరరావు మృతదేహం

సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : నారశింహునిపేట గ్రామం నంద చెరువు వద్ద సీతానగరం మండలం గుచ్చిమికి చెందిన బట్టల వ్యాపారి కింతలి నాగేశ్వరరావు(62)మంగళవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆయనకు భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమారులు క్రాంతికుమార్, అనిల్‌కుమార్‌ ఉన్నారు. పోలీసులు, స్థానికులు, బంధువులు తెలిపిన వివరాలు... గుచ్చిమికి చెందిన నాగేశ్వరరావు ద్విచక్ర వాహనంపై గ్రామాలలో బట్టలు అమ్ముతుంటాడు.

మంగళవారం ఉదయం గుచ్చిమి నుంచి తన ద్విచక్ర వాహనంపై మక్కువలో ఉన్న తన చెల్లి రుగడ లక్ష్మికి  ఇంటి నిర్మాణం నిమిత్తం లక్ష రూపాయలు ఇవ్వడానికి వెళ్లాడు. తన చెల్లెలు ఇంటికి ఉదయం 11గంటలకు వెళ్లిన నాగేశ్వరరావు డబ్బులిచ్చి, భోజనం చేసిన అనంతరం 2గంటల సమయంలో గుచ్చిమికి బయలు దేరాడు. నారశింహునిపేట – జగ్గునాయుడుపేట మధ్యలో ఉన్న నందచెరువు వద్ద స్థానికులు ద్విచక్రవాహనం పడి ఉండడం, పక్కనే వ్యక్తి గాయాలతో పడి ఉండడం గమనించి గ్రామపెద్దలకు,  పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వివరాలు తెలుసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ ప్రసాదరావు తన సిబ్బందితో వచ్చి సంఘటనా స్థలిలో ఆధారాలు సేకరించారు. వాహనం పొదల్లో పడిపోవడం, హెల్మెట్‌ ఉన్నా నాగేశ్వరరావు తలకు, నోటిపై గాయాలు ఉండడం, ఫ్యాంట్‌ చిరిగి ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తు చేస్తామని ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా గుర్తించామని ఎస్‌ఐ ప్రసాదరావు తెలిపారు. ఏఎస్‌పీ గౌతమిశాలి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.సంఘటనా స్థలికి చేరుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. నాగేశ్వరరావుకు ఎవరూ శత్రువులు లేరని, మృతదేహాన్ని చూస్తే ఎవరో కొట్టి చంపేసి పడేసినట్లుందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన మెడలో గొలుసు, ఉంగరం లేదని, పర్సు కూడా లేదని తెలిపారు. 

హత్యే అన్న అనుమానాలు...
కాగా సంఘటనా స్థలంలో చెరువు సమీపంలో మృతదేహాన్ని పరిశీలించిన పలువురు రోడ్డు ప్రమాదం కాదని, ఒకవేళ వాహన ప్రమాదం జరిగినా మొక్కలు ఉన్నాయని, హెల్మెట్‌ ఉంద ని చనిపోయేటంత ప్రమాదం జరగదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాగేశ్వరరావు   గాయాలు తీరును బట్టి ఆయనను ఎవరో తీవ్రంగా గాయపరిచి హత్య చేసినట్లు పలువురు భావిస్తున్నారు. పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించే ఏర్పాట్లు చేశారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా