నా కుమార్తెను అల్లుడే కడతేర్చాడు

5 Oct, 2018 07:30 IST|Sakshi
ఘటనాస్థలం వద్ద భర్త సత్యనారాయణను ప్రశ్నిస్తున్న డీఎస్పీ బర్ల ప్రసాదరావు, సీఐ వేణుగోపాలరావు నాగ కనకదుర్గ(ఫైల్‌)

ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదు

సూసైడ్‌ నోట్‌లోని రాత ఆమెది కాదు

మృతురాలి నాగ కనకదుర్గ తండ్రి ఆరోపణ

శ్రీకాకుళం, కాశీబుగ్గ: నా కుమార్తె నాగ కనకదుర్గ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదని, ఆమెను చిత్రహింసలకు గురిచేసి చంపేసింది తన అల్లుడేనని మృతురాలి తండ్రి నాగభూషణబ్రహ్మ పోలీసులకు తెలిపారు. కనకదుర్గ మృతి చెందిన విషయం అల్లుడు చెప్పలేదని, ఇతరుల ద్వారా తెలుసుకుని ఇక్కడికి వచ్చామన్నారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని వెంకటేశ్వర సినిమా థియేటర్‌ వెనుక ఏటీఎం అపార్ట్‌మెంట్‌లో సత్యనారాయణ, నాగ కనకదుర్గ దంపతులు నివహిస్తున్నారు. మంగళవారం రాత్రి కనకదుర్గ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్టు పడివుంది. ఈ విషయం తెలుసుకున్న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఉంటున్న మృతురాలి తండ్రి, సోదరుడు, కుటుంబ సభ్యులు దాదాపు 50 మంది బుధవారం రాత్రి 10 గంటలకు పలాస చేరుకున్నారు. కనకదుర్గ మృతదేహం చూసి తండ్రి, సోదరుడు బోరున విలపించారు.

రాత్రి 11 గంటల సమయంలో నాగ కనకదుర్గ భర్త సత్యనారాయణను ఏలూరు నుంచి వచ్చిన మృతురాలి కుటుంబ సభ్యులు చితకబాదారు. తర్వాత అర్ధరాత్రి కాశీబుగ్గ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా మృతురాలి తండ్రి నాగభూషణం మాట్లాడుతూ తన కుమార్తె నాగకనకదుర్గ ఎంఎస్‌సీ చదివిందని, పెళ్లై 11 ఏళ్లు కావస్తుందని, 8 ఏళ్లుగా తమ కుమార్తెను అల్లుడు సత్యనారాయణ పుట్టింటికి పంపించలేదన్నారు. 8 ఏళ్లగా ఇంటికి ఫోన్‌ చేయనీయకుండా, ఇంటి ముఖం పట్టకుండా చిత్ర హింసలకు గురిచేసే వాడని తెలిపారు. పిల్లలు లేరని గత కొన్నేళ్లుగా అత్తారింటి వారి నుంచి వేధింపులు ఎక్కువైయ్యాయన్నారు. కనీసం ఆస్పత్రికి వేళ్లేందుకైనా సత్యనారాయణ వెంట వెళ్లేవాడు కాదన్నారు. ఫోన్‌ చేసి తమతో మాట్లాడించేవాడు కాదన్నారు. చివరకు తనబాధ తనే పడతానని ఎవరూ కలుగచేసుకోవద్దని కనకదుగ్గ తమకు చెప్పి నరకం అనుభవించిందన్నారు. తమ కూతురిని అల్లుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని పోలీసులు వద్ద రోదించారు.

ఆ చేతిరాత నా కుమార్తెది కాదు
ఎంఎస్‌సీ పూర్తిచేసి గ్రూప్స్‌కు ప్రిపేర్‌ అయ్యే తమ అమ్మాయిని ప్రేమిస్తున్నానని ఆమెకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుని చివరకు మరణించే విధంగా చేశాడని ఆరోపించారు. ఆమె వద్ద ఉన్న సూసైడ్‌ నోట్‌ను పోలీసులు, పత్రికలు, టీవీ ఛానల్‌ ఆత్మహత్యగా వారికి వారే నిర్ధారించడం మరింత మా కుటుంబానికి కలిచివేస్తుందన్నారు. ఊరుకాని ఊరు వచ్చి రాత్రంతా ఆస్పత్రి బయట దోమలతో కంటిమీద కునుకులేకుండా ఇబ్బందులు పడ్డామన్నారు. కనకదుర్గ ఉరివేసుకుంటే కాలు ఎందుకు అంత కిందకు ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. సూసైడ్‌ నోట్‌ తమ కుమార్తె రాసింది కాదని, ఆమె భర్త, కుటుంబ సభ్యులు చంపేసి కట్టుకథ అల్లుతున్నారని, ఈ విషయం ఎవరికి చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు. కనకదుర్గ తమ్ముడు విజయ్‌ మాట్లాడుతూ గతంలోనే సత్యనారాయణతో పాటు అతని కుటుంబీకులు పలుమార్లు తన అక్కను వేధించారన్నారు. ఇంకో పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుందని, పిల్లలు పుడతారని తరచూ వేధించేవాడని తెలిపారు. సత్యనారాయణతో పాటు అతని కుటుంబీకులు ఏకమై అక్కని చంపేశారని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు సక్రమంగా విచారణ చేపట్టాలని వేడుకుంటున్నారు. ఇదిలావుండగా ఈ కేసును పోలీసులు పునఃపరిశీలన జరుపుతున్నారు. డీఎస్పీ బర్ల ప్రసాదరావు, సీఐ వేణుగోపాలరావు ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి వద్ద మృతురాలి భర్తను ప్రశ్నించారు. మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వద్ద వివరాలు సేకరించారు.

మరిన్ని వార్తలు