పెళ్లి చేస్తామని చెప్పి హత్య చేశారు

9 Jun, 2020 10:48 IST|Sakshi

సాక్షి, చౌటుప్పల్‌ : ప్రేమ వివాహాన్ని యువతి కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. దీంతో పెళ్లి చేసుకున్న యువకుడి కుటుంబాన్ని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే  ఆ యువకుడి తండ్రిని పథకం ప్రకారం మాటేసి మట్టుబెట్టారు. సంస్థాన్‌నారాయణపురం మండలం జనగాంలో ఈ నెల 5వ తేదీన వెలుగుచూసిన వ్యక్తి దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్యకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయమున్న ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. సోమవారం చౌటుప్పల్‌ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. సంస్థాన్‌నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన గడ్డం నవనీత అదే గ్రామానికి చెందిన గొండిగళ్ల గాలయ్య కుమారుడు బాబును ప్రేమించింది. ఈ విషయం పెద్దలకు తెలిసింది. ఆ క్రమంలో గతేడాది అక్టోబర్‌ నెలలో ప్రేమికులిద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఎక్కడో దూర ప్రాంతంలో ఉంటున్నారు.  అప్పటి నుంచి నవనీత కుటుంబ సభ్యులు కోపంతో రగిలిపోయారు. ఆ కుటుంబాన్ని ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. 

పెళ్లి చేస్తామని నమ్మించి..
ప్రేమించిన యువకుడితోనే పెళ్లి చేస్తామని నమ్మించిన నవనీత కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. ఆ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వేరే యువకుడితో పెళ్లి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఫిబ్రవరి 15న నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ  నవనీత ప్రేమ వ్యవహారం  తెలిసిపోవడంతో మగ పెళ్లివారు ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. ఆ క్రమంలో అదే నెల 22న నవనీత తాను ప్రేమించిన బాబుతో కలిసి వెళ్లిపోయి కొద్ది రోజుల తర్వాత పెళ్లి చేసుకుంది.  

కక్ష పెంచుకుని హత్యకు పన్నాగం 
గ్రామానికి చెందిన గొండిగళ్ల బాబు తన కూతురు నవనీతను పెళ్లిచేసుకోవడాన్ని తల్లిదండ్రులు భరించలేకపోయారు.  అదే సమయంలో నవనీత అన్నలు మరింత కక్ష పెంచుకున్నారు. బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను చంపాలనుకున్నారు. అందుకోసం ఇదే మండలంలోని పుట్టపాక గ్రామానికి చెందిన తమ సమీప బంధువైన లౌలేష్‌తో చర్చించారు. అంతా కలిసి హత్యకు పథకాన్ని రూపొందించారు. 

ఊర్లోనే మాటు వేసి ..
బాబు తండ్రి గొండిగళ్ల గాలయ్య ఈనెల 5న బ్యాంకులో పని నిమిత్తం నారాయణపురం మండల కేంద్రానికి ద్విచక్రవాహనంపై  వెళ్లాడు. ఆ సమయంలో నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన గడ్డం గాలయ్య, అతని కుమారులు  గడ్డం సురేష్,  గడ్డం వెంకటేశ్, గడ్డం రమేష్, సోదరుడి కుమారులు గడ్డం స్వామి, గడ్డం రాజు  గ్రామ శివారులో ఉన్న ప్రాథమిక పాఠశాల వద్ద ఉండి గమనించారు. సాయంత్రంలోపు గొండిగళ్ల గాలయ్య తిరిగి స్వగ్రామానికి వస్తాడని భావించి అక్కడే మాటు వేశారు. గొండిగళ్ల గాలయ్య  గ్రామానికి వస్తున్న క్రమంలో స్కూల్‌ వద్ద మాటు వేసి ఉన్న నవనీత అన్న సురేష్‌ తన వెంట తెచ్చుకున్న ముంజ కొడవలితో నరికి చంపాడు. ఆరుగురు నిందితులు గ్రామంలోని వ్యవసాయ బావి వద్ద ఉండగా, మరో నిందితుడు దాసరి లౌలేష్‌ను పుట్టపాక గ్రామంలో అరెస్ట్‌ చేసినట్లు డీసీపీ వివరించారు. వారి వద్ద కత్తి, స్కూటీ, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్‌ నిమిత్తం నల్లగొండ కోర్టుకు తరలించారు. సమావేశంలో చౌటుప్పల్‌ ఏసీపీ సత్తయ్య, సీఐ శ్రీనివాస్, ఎస్సై నాగరాజు ఉన్నారు. 

మరిన్ని వార్తలు