తండ్రి చేతబడి చేశాడని...కుమారుడి హత్య

26 May, 2020 10:08 IST|Sakshi
సీఐతో కలిసి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ

వీడిన కతాల్‌గూడ హత్య కేసు మిస్టరీ

వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి 

పోలీసుల అదుపులో నలుగురు నిందితులు

సాక్షి, నల్లగొండ క్రైం : పట్టణ సమీపంలోని దేవరకొండ రోడ్డులో గల కతాల్‌గూడ అర్బన్‌ కాలనీకి చెందిన దాసరి నవీన్‌ (20) హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈనెల 20న శ్రీ ఆంజనేయ గార్డెన్‌ సమీపంలో నవీన్‌ను బీరు సీసాలతో కొట్టి తలపై బండరాయి మోది హత్యచేశారు. నవీన్‌ తండ్రి బాలయ్య చేతబడి చేయడం వల్లనే అదే కాలనీకి చెందిన దాసరి రమేష్‌ ఆరు నెలల క్రితం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానంతో మృతుడి సోదరుడు, బావమర్దులు కలిసి బాలయ్య కుమారుడు నవీన్‌ను ప్లాన్‌ ప్రకారమే హత్య చేశారని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు.

వన్‌టౌన్‌ సీఐ సురేష్‌తో కలిసి ఆయన సోమవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... బాలయ్య తన వ్యవసాయ భూమి పక్కన మరొకరి భూమి కొనేందుకు ప్రయత్నించాడు. దాంతో దాసరి రమేష్‌ అడ్డు వచ్చాడు. ఈ నేపథ్యంలో అతడిని అడ్డు తప్పిస్తే భూమి కొనుగోలు సులువు అవుతుందని ఆత్మహత్య చేసుకునేలా బాలయ్య చేతబడి చేశాడని రమేష్‌ సోదరుడు హరీష్, బావమర్దులు నామ శ్రీకాంత్, మద్దెల శేఖర్‌ భావించారు. ఈ విషయాన్ని రమేష్‌ మృతి అనంతరం ఆయన కుటుంబ సభ్యులు మిర్యాలగూడలో భూతవైద్యుడి వద్దకు వెళ్లగా చెప్పినట్లు తెలిసింది.
 
హత్య చేసింది ఇలా...
దాసరి బాలయ్యపై పగ పెంచుకున్న రమేష్‌ కుటుంబ సభ్యులు బాలయ్య కుమారుడు నవీన్‌ను హత్యచేసేందుకు ఆరు నెలలుగా ప్లాన్‌ చేశారు. కుమారుడు చనిపోతే తండ్రికి మానసికక్షోభ తెలవాలని, తమలాగే బాలయ్య ఇబ్బందులు పడాలని రమేశ్‌ బంధువులు హత్యకు ప్లాన్‌ చేశారు. నవీన్‌ స్నేహితుడైన రాజు ద్వారా ఫోన్‌ చేసి మద్యం సేవించేందుకు ఫంక్షన్‌హాల్‌ సమీపంలోని చెట్ల పొదల్లోకి పిలిచారు. రాజు, నామ శ్రీకాంత్, దాసరి హరీష్, మద్దెల శేఖర్‌ కలిసి చెట్ల పొదల్లో మద్యం సేవించారు. అనంతరం మత్తులోకి వెళ్లిన తర్వాత మీ నాన్న చేతబడి చేయడంతోనే రమేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడని, అందుకు ప్రతీకారంగా నిన్ను హత్యచేస్తామని నవీన్‌పై బీరు సీసాలతో దాడి చేశారు. చదవండి: ఒకేరోజు ముగ్గురి ఆత్మహత్య

పారిపోతుండగా....
ప్రాణాలు కాపాడుకునేందుకు నవీన్‌ పరుగెడుతుండగా అడ్డగించారు. దాసరి హరీష్, మద్దెల శేఖర్‌ కలిసి కింద పడేసి పట్టుకున్నారు. నామ శ్రీకాంత్‌ బండరాయిని తలపై వేయడంతో నవీన్‌ ప్రాణాలు వదిలాడు. హత్యకేసులో 12 మంది భాగస్వామ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం సమయంలోనే హత్యచేసేందుకు ప్లాన్‌ వేసినప్పటికీ శ్రీ ఆంజనేయ గార్డెన్‌లో శుభకార్యం జరగడంతో మల విసర్జన కోసం, మద్యం సేవించేందుకు, సిగరేట్‌ తాగేందుకు చెట్ల పొదల వైపు ప్రజలు వచ్చిపోతుండడంతో హత్య చేయడం కుదర్లేదు. సాయంత్రం 7 గంటల సమయంలో ప్రజలు ఎవరూ అటువైపు రాకపోవడంతో హత్య చేశారు. నలుగురిని అదుపులోకి తీసు  కున్నామని, మరో 8 మందిని అరెస్టు చేస్తామని ఏఎస్పీ తెలిపారు. విశ్వసనీయ సమాచారంతో కతాల్‌గూడ అర్బన్‌ కాలనీలో నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఇలా కూపీ లాగారు....
హత్య జరిగిన ప్రదేశంలో బీరు సీసాలు ఉన్నాయి. వాటిపై ఉన్న లేబుల్‌ ఆధారంగా వైన్‌ షాపులో సీసీ కెమెరాలను పరిశీలించారు. నలుగురు నేరస్తులు మద్యం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. నవీన్‌కు రాజు ఫోన్‌ చేసి మద్యం సేవించేందుకు పిలిచినట్లు ఫోన్‌కాల్‌ రికార్డు ఉంది. దీంతో నేరస్తులను పోలీసులు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి పట్టుకున్నారు. కేసును ఛేదించిన రాము, రాజు, షకీల్, శ్రీనును డీఎస్పీ, సీఐ అభినందించారు.   చదవండి: ప్రియుడిని గాయపర్చిన ప్రియురాలు

మరిన్ని వార్తలు