దినేష్‌ కుమార్‌ హత్య కేసులో వీడిన మిస్టరీ

26 Feb, 2018 11:01 IST|Sakshi
నిందితుల అరెస్టు చూపుతున్న డీఎస్పీ చిదానందరెడ్డి, సీఐ సురేష్‌కుమార్‌

ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టడంతోనే హత్య     

ముగ్గురు నిందితుల అరెస్ట్‌

చిత్తూరు, మదనపల్లె క్రైం: మదనపల్లెలోని వెంకటేశ్వర లాడ్జి ఎదుట ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి జరిగిన దినేష్‌కుమార్‌ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. స్నేహితుల మధ్య ప్రేమ వ్యవహారం బయటపెట్టడంతోనే హత్య జరిగినట్టు తేల్చారు. హత్యకు పాల్పడిన ముగ్గురిని టూటౌన్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. డీఎస్పీ ఎం.చిదానందరెడ్డి, సీఐ సురేష్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. పట్టణంలోని సుభాష్‌రోడ్‌ ఎక్స్‌టెంక్షన్‌ గుర్రప్ప నాయుడు వీధిలో ఉంటున్న కన్నెమడుగు రవికుమార్, అంజమ్మ దంపతుల ఒక్కగా నొక్క కుమారుడు కె.దినేష్‌కుమార్‌(26)ని అదే ప్రాంతానికి చెందిన సగటు ఉదయ్‌కుమార్‌(28), సయ్యద్‌ ఇర్ఫాన్‌(27), ఎస్‌.నోమన్‌(28) స్నేహితులని తెలి పారు. వీరు పీవోపీ పనులతో పాటు మెకానిక్‌ గ్యారేజీలకు వేస్ట్‌ వ్యాపారం చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యాపార నిమిత్తం తరచూ బెంగళూరు వెళ్లేవారని చెప్పారు. అక్కడ ఉండే మదనపల్లె రామారావు కాలనీకి చెందిన చిరంజీవిని కలిసేవారని తెలిపారు. చిరంజీవికి ఉదయ్‌కుమార్, సయ్యద్‌ ఇర్ఫాన్, ఎస్‌.నోమన్‌ మంచి స్నేహం ఏర్పడిందన్నారు. ఈ క్రమంలో చిరంజీవి ప్రియురాలు హైదరాబాదులో ఇటీవల ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. దీంతో భయపడిన అతను తనపై అక్కడి పోలీసులు కేసు పెట్టారేమోనని తెలుసుకునేందుకు సయ్యద్‌ ఇర్ఫాన్, నోమన్, ఉదయ్‌కుమార్‌ను హైదరాబాదు పంపించాడన్నారు. అంతేగాక ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఉండాలని చిరంజీవి వారిని కోరాడని తెలిపారు.

యువతి ఆత్మహత్య విషయం బయటికి పొక్కడంతో..
యువతి ఆత్మహత్య విషయం బయట కు పొక్కడంతో దినేష్‌కుమార్, ఉదయ్‌ కుమార్‌ గొడవపడ్డారని చెప్పారు. దీంతో దినేష్‌కుమార్‌ను హతమార్చాలని ఉదయ్‌కుమార్‌ పథకం పన్నాడని తెలిపారు. మదనపల్లె ఆర్టీసీ బస్టాండు సమీపంలోని వెంకటేశ్వర లాడ్జిలో ఉన్న దినేష్‌కుమార్‌ను ఇర్ఫాన్, నోమన్‌ సాయంతో ఈ నెల 16న మద్యం తాగిం చి అర్ధరాత్రి వేళ లాడ్జి కిందకు తీసుకొచ్చి మాటల్లో పెట్టారన్నారు. అప్పటికే అక్కడ వేట కొడవలితో పొంచి ఉన్న ఉదయ్‌కుమార్‌ వెనక నుంచి వచ్చి తల పై ఒక్కసారిగా నరకడంతో దినేష్‌కుమార్‌ కుప్పకూలిపోయాడన్నారు. గమనించిన స్థానికులు అతన్ని ఆటోలో ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారని పేర్కొన్నారు. పరారైన నిందితుల కోసం సీఐ సురేష్‌కుమార్, ఎస్‌ఐలు నాగేశ్వరరావు, క్రిష్ణయ్య, సిబ్బంది రాజేష్‌ తదితరులు గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు. నిందితులు పుంగనూరు రోడ్డులోని కనుమలో గంగమ్మ ఆలయం వద్ద ఉండగా అరెస్టు చేశామన్నారు. నిందితులను పట్టుకోవడంలో చొరవ చూపిన సీఐ, ఎస్‌ఐలతో పాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

మరిన్ని వార్తలు