వేలిముద్రలే పట్టించాయి

7 Jan, 2020 10:31 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితులు

భారీ చోరీ కేసులో వీడిన మిస్టరీ  

జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలో ఘటన

ముగ్గురి అరెస్టు రూ.29 లక్షల విలువైనచోరీ సొత్తు స్వాధీనం

నేరేడ్‌మెట్, సాక్షి, సిటీబ్యూరో: కాలనీల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు ఘరానా దొంగలను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్‌ 31 అర్ధరాత్రి జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసులో లభించిన నిందితుడి వేలిముద్రల ఆధారంగా 5 రోజుల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.29 లక్షల విలువైన 66 తులాల బంగారు నగలు, మూడు కేజీల వెండి వస్తువులు, ల్యాప్‌టాప్‌ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో మల్కాజ్‌గిరి డీసీపీ రక్షిత కే మూర్తితో కలిసి సీపీ మహేష్‌ భగవత్‌ సోమవారం వివరాలు వెల్లడించారు. 

జైలుకు వెళ్లొచ్చినా..
మేడ్చల్‌ జిల్లా, బాలాజీనగర్‌కు చెందిన తూన సంజయ్‌ సింగ్‌ అలియాస్‌ తునా ఇంటర్మీడియట్‌తో చదివి ఆపేశాడు. చిన్నప్పటి నుంచే జులాయిగా తిరుగుతున్న సంజయ్‌కి మౌలాలికి చెందిన మనీష్‌ ఉపాధ్యాయ్‌ అలియాస్‌ సంజూ మహరాజుతో పరిచయం ఏర్పడింది.  జల్సాలకు అలవాటు పడిన వీరు అందుకు అవసరమైన డబ్బులకోసం దొంగతనాలకు పాల్పడుతున్నారు. 2017లో తుకారాంగేట్‌ ఠాణా పరిధిలో జరిగిన చోరీ కేసులో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చారు. అయినా తమ పంథా మార్చుకోకుండా చోరీలకు పాల్పడుతున్నారు.  పలు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో సంజయ్‌ సింగ్‌ 8, మనీష్‌ ఉపాధ్యాయ్‌ 6 కేసులు ఉన్నాయి. 2019 జూన్‌లో జరిగిన చోరీ కేసులో అరెస్టై  జైలుకు వెళ్లి వచ్చిన సంజయ్‌ సింగ్, మనీష్‌ ఉపాధ్యాయ్, బాలాజీనగర్‌కు చెందిన మరో మిత్రుడు ప్రదీప్‌ శ్యామ్‌తో కలిసి డిసెంబర్‌ 31న జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలో  తాళంవేసి ఉన్న ఇంట్లోకి చొరబడి 51 తులాల బంగారు నగలు, నాలుగు కిలోల వెండి, రూ.50,000 నగదు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఎత్తుకెళ్లారు. బాధితుడు దానమ్‌ నర్సింగ్‌రావు ఫిర్యాదు మేరకు జవహర్‌నగర్‌ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.  క్లూస్‌ టీమ్‌ అధికారి అనిల్‌ కుమార్‌ బృందం అక్కడికి చేరుకొని వేలిముద్రలను సేకరించింది. 

ఈ వేలిముద్రలను పాత ప్రాపర్టీ ఆఫెన్స్‌లో నిందితుల నుంచి సేకరించిన వేలిముద్రలతో పొల్చి చూడగా సంజయ్‌ సింగ్‌ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. అప్పటినుంచి అతని కదలికలపై నిఘా వేసిన జవహర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతిరావు, మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ,సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్లు నవీన్‌ కుమార్, ఎస్‌.లింగయ్య నేతృత్వంలోని బృందం దమ్మాయిగూడ ఎక్స్‌రోడ్డు వద్ద ఆదివారం సాయంత్రం సంజయ్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకుంది. విచారణలో అతను మరో ఇద్దరు నిందితులు మనీష్‌ ఉపాధ్‌యాయ్, ప్రదీప్‌ శ్యామ్‌ పేర్లు వెల్లడించడంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులను సోమవారం న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు