అయ్యో..అక్షర

26 May, 2018 10:26 IST|Sakshi
అక్షర( ఫైల్‌)

వీడిన 16 నెలల చిన్నారి మృతి కేసు మిస్టరీ

చేయి కొరికిందని చిన్నారిని సంపులో పడేసిన మరో చిన్నారి

తెలిసీ తెలియని వయసులో...ఇద్దరి జీవితాల్లో విషాదం

రాంగోపాల్‌పేట్‌: రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 16 నెలల చిన్నారి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు మిస్టరీని ఛేదించారు. తనను కొరికిందని ఆ చిన్నారిపై కోపం పెంచుకున్న మరో బాలిక ఈ ఘాతుకానికి పాల్పడింది. హత్య చేసిన బాలికను అరెస్టు చేసి జువైనల్‌ హోంకు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం జలవిహార్‌లో పనిచేసే అప్పల నాయుడు రాజుల కుమార్తె అక్షర గురువారం సాయంత్రం అదే ప్రాంతంలోని మురుగు నీటి సంప్‌లో శవమై తేలిన సంగతి విదితమే. అప్పలనాయుడు కుటుంబం జలవిహార్‌లో పనిచేస్తూ అక్కడే ఉండే రేకుల షెడ్డులో మిగతా కార్మికులతో కలిసి ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం అందరు పనిలో ఉండగా అక్షరతో పాటు మరో 11 ఏళ్ల బాలిక ఆడుకుంటూ ఉంది. కొద్దిసేపటి తర్వాత ఆ బాలిక వెళ్లి అక్షరను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్‌ చేశాడంటూ అప్పలనాయుడుకు చెప్పింది. వెంటనే అన్ని ప్రాంతాల్లో వెదికి రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు వచ్చి చుట్టు పక్కల గాలించగా సంపులో అక్షర మృతదేహం కనిపించింది. 

సంపులో పడేసి...కిడ్నాప్‌గా డ్రామా
ఫిర్యాదు అందగానే ఈ కేసును పోలీసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్షర కుటుంబ సభ్యులకు ఎవరైన శత్రువులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి సీసీ కెమెరాలను పరిశీలించగా 11 ఏళ్ల బాలిక ఈ చిన్నారిని కొద్దిసేపు ఆడిస్తూ, ఎత్తుకుని ఉండటం కనిపించింది. ఆ ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తులు కూడా ఎవరూ కనిపించ లేదు. తనపై ఎవరికి అనుమానం రాకుండా ఎవరో ఎత్తుకుని వెళ్లారని కట్టుకథ అల్లినట్లు పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ బాలిక అవసరం లేకున్నా పదేపదే అదే చెబుతుండటం, పొంతన లేకుండా మాటలు చెప్పడంతో అనుమానం మరింత పెరిగి పోలీసులు గుచ్చి గుచ్చి ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పింది. అక్షర గతంలో ఒక మారు తన చేతిపై కొరికిందని, అందుకే అదే కోపంతో ఎత్తుకుని వెళ్లి సంపులో పడేసినట్లు బాలిక పోలీసులకు చెప్పింది. మాటలు కూడా రాని ఓ 16 నెలల చిన్నారి మృతి చెందితే పూర్తిగా లోకజ్ఞానం కూడా తెలియని బాలిక హంతకురాలు కావడం విచిత్రం. అనంతరం ఆ బాలికను శుక్రవారం అరెస్టు చేసి జువైనల్‌ హోంకు తరలించారు. మృతి చెందిన చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు