స్మగ్లింగ్‌ స్పెషలిస్ట్‌

26 Jul, 2019 10:27 IST|Sakshi

రూ. కోట్లు ఊసెత్తకుండా కారు పోయిందంటాడు!

రాయకల్‌ బందిపోటు దొంగతనంపై ‘గోప్యత’

ఫిర్యాదులో అసలు విషయం చెప్పని డ్రైవర్‌

దర్యాప్తులోనే గుర్తించిన సైబరాబాద్‌ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: ‘జీరో నెంబర్‌’ దందా చేసే మైసూర్‌ వాసి రాజు నాంగ్రే పసిడి, డబ్బు రవాణాలు కారుల్లో ప్రత్యేక లాకర్లు ఏర్పాటు చేసుకున్నాడు. వాటికి డ్రైవర్లుగా పని చేసే వారికి ఓ కీలక విషయంలో తర్ఫీదు కూడా ఇచ్చాడు. వివిధ రాష్ట్రాలకు తిరిగే వీళ్ళు ఏదైనా నేరం బారినపడితే స్థానిక పోలీసులకు ఇచ్చే ఫిర్యాదులో ఎక్కడా బంగారం, డబ్బు విషయం ప్రస్తావించకుండా కౌన్సిలింగ్‌ చేశాడు. ‘పన్ను’పోటు తప్పించుకోవడానికే ఈ ఎత్తులు వేశాడు. ఫలితంగానే గతంలో కేరళ, కర్ణాటక పోలీసులతో కలిసి మేనేజ్‌ చేసుకుంటూ తన దందాను రికార్డుల్లోకి ఎక్కించలేదు. ఈసారి నేరం సైబరాబాద్‌లో జరగడంతో అతడికి ఆ చాన్స్‌ లేకుండా పోయింది. షాద్‌నగర్‌ ఠాణా పరిధిలోని రాయకల్‌ టోల్‌ప్లాజా సమీపంలో గత నెల 28న జరిగిన బందిపోటు దొంగతనం కేసులో ఉన్న కీలకాంశమిది. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు నిందితుల్ని సైబరాబాద్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన విషయం విదితమే. 

అక్రమ బంగారంగా అనుమానం...
మహారాష్ట్రకు చెందిన రాజు నాంగ్రే మైసూర్‌లో స్థిరపడ్డారు. అక్కడ ఉంటూనే కేరళ నుంచి తక్కువ ధరకు బంగారం ఖరీదు చేస్తుంటాడు. ఆ రాష్ట్రానికి చెందిన అనేక మంది విదేశాల్లో ఉంటున్నారు. స్థానిక ఏజెంట్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న రాజు ఆయా దేశాల నుంచి వాళ్ళు తిరిగి వచ్చేప్పుడు బంగారం అక్రమంగా తీసుకువచ్చేలా చేసేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా దేశంలోని స్మగుల్డ్‌ అయిన గోల్డ్‌ను తక్కువ ధరకు వారి నుంచి ఖరీదు చేసే వాడు. దీన్ని హైదరాబాద్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్రల్లో ఉన్న బంగారం వ్యాపారులకు ఎక్కువ ధరకు విక్రయించేవాడు. వ్యాపారులకు పసిడి డెలివరీ చేయడానికి, వారి నుంచి డబ్బు వసూలు చేసుకు రావడానికి ఏడు ప్రత్యేక వాహనాలు సిద్ధం చేశారు. ఈ వాహనాలను తీసుకువెళ్ళే, తిరిగి తీసుకువచ్చే డ్రైవర్లకు రాజు ఓ విషయం స్పష్టం చేసేవాడు. ఎక్కడైనా నేరం బారినపడితే కారులో ఉండే బంగారం, డబ్బు విషయం బయటకు చెప్పకుండానే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పదేపదే చెప్పేవాడు.  

తలలు పట్టుకున్న పోలీసులు...
ఓ మధ్యస్థాయి కారు కోసం నలుగురు వ్యక్తులు వచ్చి, తుపాకీ చూపించి మరీ ఎత్తుకుపోవడం ఏంటని పోలీసులు తలలు పట్టుకున్నారు. అయితే అనుమానం వచ్చిన అధికారులు ఫిర్యాదుదారుడైన రాహుల్‌ను వివిధ కోణాల్లో, లోతుగా ప్రశ్నించారు. దీంతో ఆ కారులో రహస్య లాకర్‌ ఉండటం, అందులో రూ.3.67 కోట్ల నగదు ఉన్న విషయం బయటపెట్టక తప్పలేదు. దీంతో అసలు విషయం తెలుసుకున్న అధికారులు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ గాలించారు. చివరకు ఏడుగురు బందిపోటు దొంగల్నీ పట్టుకుని రూ.2.89 కోట్లు, బంగారం రికవరీ చేశారు. యజమాని రాజు ఎంతగా ప్రయత్నించినా నగదును రికార్డుల్లోకి ఎక్కకుండా ఆపలేకపోయాడు. ఇది భారీ మొత్తం కావడంతో ఈ విషయంపై ఆదాయపు పన్ను శాఖకు లేఖ రాయాలని సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ నిర్ణయించారు. డీమానిటైజేషన్‌ తర్వాత అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు కలిగి ఉండటమూ నేరమే అని పోలీసులు చెప్తున్నారు. ఈ విషయాలన్నీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు చూసుకుంటారని అంటున్నారు. ఈ బందిపోటు ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన అధికారులకు పోలీసు కమిషనర్‌ ప్రత్యేక రివార్డులు అందించారు.  

ఆ రెండు చోట్లా సాధ్యమైనా...
రాజుకు చెందిన వాహనాలు బంగారం, డబ్బుతో వెళ్ళి వస్తున్నప్పుడు గతంలోనూ మాయమయ్యాయి. కొన్ని ముఠాలు ఆ కారుతో సహా సర్వం దోచుకుపోయాయి. అయినప్పటికీ అప్పట్లో ఆయా వాహనాలకు డ్రైవర్లుగా వ్యవహరించిన వాళ్ళు పోలీసులకు కేవలం వాహనం పోయిందని మాత్రమే ఫిర్యాదు చేశారు.విషయం తెలుసుకున్న ఆ పోలీసుస్టేషన్‌కు చేరుకునే రాజు అధికారులను మేనేజ్‌ చేయడం ద్వారా తన డబ్బు, బంగారం రికార్డుల్లోకి ఎక్కకుండానే రికవరీ చేయించుకునేవాడు. ఇలా కేరళ, కర్ణాటకల్లోనూ జరిగింది. రాయకల్‌లో బందిపోటు దొంగతనానికి గురైన వాహనానికి డ్రైవర్‌గా వ్యవహరించిన రాహుల్‌ కూడా ఇలానే చేశాడు. గత నెల 28న నేరం జరిగిన తర్వాత షాద్‌నగర్‌ ఠాణాకు వెళ్ళాడు. గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు తనకు పిస్టల్‌ చూపించి, కారు పట్టుకుపోయారని ఫిర్యాదు చేశాడు. దుండగులు ఎత్తుకుపోయిన కారు మారుతి బ్రిజా అని, కేరళ రిజిస్ట్రేషన్‌తో ఉందని అందులో పేర్కొన్నాడు. 

మరిన్ని వార్తలు