బాలుడి ప్రాణం తీసిన నాటువైద్యం

15 Oct, 2019 19:31 IST|Sakshi

విజయవాడలో నాటువైద్యం పేరుతో దారుణం

సాక్షి, విజయవాడ: యూట్యూబ్ ద్వారా బుద్ధి మాంద్యానికి చికిత్స చేస్తానంటూ ఓ నాటు వైద్యుడు ఇచ్చిన ప్రకటన చూసి.. తమకు ఉన్న జబ్బులు నయమవుతాయని ఎంతో ఆశగా నగరానికి వచ్చిన వారికి నిరాశే మిగిలింది. చికిత్స కోసం బెజవాడ వచ్చిన రోగులకు.. ఇచ్చిన నాటువైద్యం వికటించడంతో.. ఒక అమాయకపు బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ హృదయ విదారక ఘటన మంగళవారం గవర్నర్‌పేటలోని గంగోత్రి లాడ్జిలో చోటు చేసుకొంది. బుద్ధి మాంద్యానికి చికిత్స తీసుకున్న బాలుడు మృతి చెందగా.. ముగ్గురి పరిస్థితి పరిస్థితి విషమంగా మారడంతో బాధితులను వెంటనే విజయవాడ ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు.

నాటువైద్యంతో బాలుడి ప్రాణాలు బలిగొని.. మరో ముగ్గురిని ఆస్పత్రిపాలు చేసిన భూమేశ్వరరావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మృతి చెందిన బాలుడిని కడప జిల్లాకు చెందిన హరనాథ్‌గా పోలీసులు గుర్తించారు. మొత్తం పది మందికి పైగా చికిత్స పొందేందుకు నగరానికి వచ్చినట్లు బాధితులు తెలిపారు.  కృష్ణాజిల్లా ఏఎమ్‌డీఏ అసోసియేషన్ ద్వారా బెంగళూరు, బళ్లారి, తెలంగాణ, కడప ప్రాంతాలకు చెందిన 11మంది చికిత్స నిమిత్తం విజయవాడకు వచ్చారని సమాచారం. ఇదే లాడ్జిలో మూడు గదులు తీసుకుని నాలుగు రోజులుగా సదరు నాటు వైద్యుడు చికిత్సలు అందిస్తున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు