ఇంటి దొంగల అరెస్ట్‌

3 May, 2019 08:30 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న నగదు

నాగార్జున ఫైనాన్స్‌ కంపెనీలో రూ.3.95 లక్షలు అపహరించిన సంస్థ క్యాషియర్, డ్రైవర్‌

నిందితులను పట్టుకుని నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ): ఇంటి దొంగలను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇటీవల నాయుడుతోట జంక్షన్‌ దరి కృష్ణానగర్‌లో ఉన్న నాగార్జున ఫైనాన్స్‌ కంపెనీలో రూ3.95లక్షలు అపహరించిన ఇద్దరిని నేరవిభాగ పోలీసులు అరెస్ట్‌ చేసి, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కంచరపాలెం నేర విభాగం స్టేషన్‌లో ఏడీసీపీ సురేష్‌బాబు గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... నాగార్జున ఫైనాన్స్‌ కంపెనీలో క్యాషియర్‌గా విధులు నిర్వహిస్తున్న పోలాకి శ్యామ్‌కుమార్, డ్రైవర్‌గా పని చేస్తున్న జోరేగుల ఫృద్వీరాజ్‌ కలిసి ఒక పథకం ప్రకారంగా క్యాష్‌ డర్క్‌లో ఉన్న రూ.3.95లక్షల నగదును గత నెల 27న రాత్రి అపహరించారు.

తరువాత కార్యాలయం వెనుక భాగంలో తలుపులు తీసి వదిలేశారు. సీసీటీవీ పని చేయకుండా చేశారు. ఆ రాత్రి కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయారు. ఉదయం చూసేసరికి చోరీ జరిగినట్లు గుర్తించి పెందుర్తి పోలీసులకు సమాచారమిచ్చారు. కార్యాలయం మేనేజర్‌ వల్లపు చిన్నరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగిన తీరును గమనించిన క్రైమ్‌ పోలీసులు క్యాషియర్‌ శ్యామ్‌కుమార్‌పై అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. తామే దొంగతనం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దీంతో వీరిపై కేసు నమోదు చేసి రూ.3.95లక్షల నగదు స్వాధీనం చేసున్నారు. ఈ కేసులో చాకచక్యంగా నిందితులను పట్టుకున్న ఎస్‌ఐ కోటేశ్వరరావు, కానిస్టేబుల్‌ సంతోష్‌కుమార్, హెడ్‌ కానిస్టేబుల్‌ శంకర్‌హజిలకు నగదు పురస్కారాలు అందించారు. సమావేశంలో ఏసీపీ ప్రభాకర్‌ బాబు, సీఐ నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు