నల్లగొండలో సైకో స్టూడెంట్‌ వీరంగం

14 Feb, 2019 11:34 IST|Sakshi

సాక్షి, నల్లగొండ : పాత కక్షలను మనసులో పెట్టుకొన్న ఓ ఇంటర్‌ విద్యార్థి.. తోటి విద్యార్థులపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణ సంఘటనన నల్లగొండ జిల్లాలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్ మండలం దోరేపల్లికి చెందిన పసునూరి ప్రవీణ్(18), అదే గ్రామానికి చెందిన బరపాటి లక్ష్మణ్(17)ల మధ్య వారం రోజుల క్రితం చిన్న గొడవ జరిగింది. అది కాస్తా ముదిరి ఘర్షణకు దారితీసింది. బుధవారం ప్రవీణ్ బస్టాండ్ వద్ద కూర్చొని ఉండగా, అదే సమయంలో లక్ష్మణ్, తన అన్న చందుతో కలిసి అక్కడికి వచ్చాడు. దీంతో వారిమధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. గొడవ పెద్దది కావడంతో లక్ష్మణ్ తమ బంధువులైన శ్రీధర్, శివాజీలకు ఫోన్‌ చేసి అక్కడికి పిలిపించాడు. నలుగురు కలిసి ప్రవీణ్‌తో ఘర్షణ పడ్డారు.

ఆ కోపంలో ప్రవీణ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో లక్ష్మణ్ ఛాతిపై పొడవగా, అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మిగతా ముగ్గురిపై దాడిచేసి గాయపరిచాడు. అక్కడే ఉన్న ప్రశాంత్ అనే యువకుడు ప్రవీణ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి పరారయ్యడు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న  పోలీసులు గ్రామానికి చేరుకుని గాయపడిన వారిని నల్లగొండలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి చేర్చారు. లక్ష్మణ్‌ మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ మర్చరీకి తరలించారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్ తెలిపారు. గొడవ విషయం మాట్లాడదామని అనుకుంటుండగా ఒక్కసారిగా ప్రవీణ్ కత్తితో దాడి చేసాడని చికిత్స పొందుతున్న బాధితుడు దాసరి శివాజీ పేర్కొన్నాడు. గాయపడిన వారిలో చందు అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

సోషల్‌ మీడియా, సినిమాల ఎఫెక్ట్‌ : ఎస్పీ
టీనేజ్‌ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ, హత్య విషయంపై జిల్లా ఎస్పీ రంగనాథ​ ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరు చూస్తే సోషల్‌ మీడియా, సినిమాల ప్రభావం కొట్టిచ్చినట్టు కనిపిస్తుందని ఆయన తెలిపారు. కేసును సీరియస్‌గా తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రామంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా చూస్తామని తెలిపారు. ఇంటర్‌ విద్యార్థి ప్రవీణ్‌ నలుగురి మీద దాడి చేయడం.. ఒకర్ని హత్య చేయడంతో ప్రస్తుతం దోరేపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

మరిన్ని వార్తలు