గంజాయితో పట్టుబడ్డ మహారాష్ట్ర స్కార్పియో

12 Jul, 2020 11:55 IST|Sakshi

సాక్షి, నల్గొండ: జిల్లాలోని నకిరేకల్‌ హైవేపై స్థానిక సీఐ తనిఖీలు నిర్వహిస్తూ మహారాష్ట్రకు చెందిన ఓ స్కార్పియో వాహనాన్ని ఆపే ప్రయత్నం చేశారు. ఆ వాహనదారు ఒక్కసారిగా పోలీసులపైకి  స్కార్పియోను తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ వేగంగా పారిపోయాడు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌ MH 16 171 నంబర్‌‌ వాహనంగా పోలీసులు గుర్తించారు. ఇక వెంటనే నకిరేకల్‌ పోలీసు సిబ్బంది వైర్‌లేస్‌ సెట్‌తో వాహనాన్ని పట్టుకోవల్సిందిగా కట్టంగూర్ ఎస్‌ఐకి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్‌ఐ కట్టంగూర్ పోలీసు స్టేషన్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌పై రోడ్డుకు అడ్డంగా పోలీసు వాహనాన్ని నిలిపి ఆ వాహనాన్ని పట్టుకున్నారు. 

పోలీసులను చూసి కారులో ఉన్న మహారాష్ట్రకు చెందిన నలుగురు వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి  పారిపోయాడు. అనుమానిత వాహనాన్ని కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌లో తనిఖీ చేయగా అందులో నుంచి దాదాపు 32 ప్యాకెట్లలకు పైగా ఒక్కోటి మూడు కిలోల గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు వారాల్లోనే  గంజాయితో పట్టుబడ్డ మూడో వాహనంగా పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు