నారాయణ కాలేజీ బస్సులో మంటలు

7 Jul, 2018 06:36 IST|Sakshi
నారాయణ విద్యాసంస్థల బస్సు నుంచి పొగ వస్తున్న దృశ్యం

ఏలూరు టౌన్‌: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫైర్‌స్టేషన్‌ సెంటరులో నారాయణ విద్యా సంస్థల కళాశాల బస్సులో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకోవడంతో బస్సులోని విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. విద్యార్థులను ఎక్కించుకున్న తర్వాత డ్రైవర్‌  కొద్ది దూరం  వెళ్లగానే బస్సులో ఆకస్మాత్తుగా మంటలు రావడంతో విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు.  పెద్దగా కేకలు వేస్తూ బస్సును ఆపాలంటూ డ్రైవర్‌కు చెప్పడంతో బస్సును నిలిపివేశారు. వెంటనే విద్యార్థులు కిందకు దూకి రోడ్డుపైకి పరుగులు తీశారు.

కూతవేటు దూరంలోనే జిల్లా అగ్నిమాపక కార్యాలయం ఉండటంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాద సంఘటన జరిగిన బస్సులో 30 మంది కళాశాల విద్యార్థులు ఉన్నారు.  వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది బస్సు వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు. దీనిపై కళాశాల  యాజమాన్యం, ఫిట్‌నెస్‌ లేకుండానే బస్సుకు అనుమతులిచ్చిన రవాణాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు