పరుగులు పెట్టించిన ఫోన్‌ కాల్‌

13 Mar, 2018 08:11 IST|Sakshi
గోతి నుంచి మూటను బయటకు తీస్తున్న పోలీసులు , బయట పడ్డ కుక్క కళేబరం

నాలుగు గంటలు ఉక్కిరిబిక్కిరైన రెవెన్యూ, పోలీసు అధికారులు

రాజేంద్రనగర్‌: నార్సింగి పోలీసులతో పాటు గండిపేట మండల రెవెన్యూ అధికారులను ఓ ఫోన్‌ కాల్‌ ఉరుకులు పరుగులు పెట్టించింది. వివరాల్లోకి వెళితే.. నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు గండిపేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం మధ్యాహ్నం ఫోన్‌ చేశాడు. గండిపేట శ్మశానవాటికలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక శవాన్ని మూటలో కట్టి పూడ్చిపెట్టి వెళ్లారని సమాచారం అందించాడు. తమ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఎక్కడా ఎవరూ మృతి చెందలేదని తెలిపాడు. దీంతో కానిస్టేబుల్‌ విషయాన్ని ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందించాడు.

అప్రమత్తమైన ఇన్‌స్పెక్టర్‌ విషయాన్ని గండిపేట మండల తహసీల్దార్‌కు సమాచారం అందించి సంఘటన స్థలానికి చేరుకున్నాడు. పోలీసులతో పాటు తహసీల్దార్, ఆర్‌ఐ శ్మశానవాటికలో పూడ్చిన స్థలం వద్దకు వెళ్లి గోతిని తీయడం ప్రారంభించారు. అనంతరం ఒక తెల్లటి వస్త్రం చుట్టిన మూట కనిపించింది. మూటను బయటకు తీసి చూడగా అందులో కుక్క శవం ఉంది. దీంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ముక్కున వేలేసుకున్నారు. తిరిగి ఆ కుక్క శవాన్ని అలాగే పూడ్చిపెట్టారు. దాదాపు 4 గంటల పాటు ఈ హైడ్రామా కొనసాగింది. తాము పెంచుకుంటున్న కుక్క మృతి చెందడంతో  యజమానులు దానిని తీసుకొచ్చి శ్మశానవాటికలో పూడ్డారు. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న శ్మశానవాటిక నిర్వాహకుడికి సమాచారం అందించలేదు.

మరిన్ని వార్తలు