అమీర్‌పేట్‌లో శాస్త్రవేత్త దారుణహత్య

2 Oct, 2019 02:59 IST|Sakshi
మృతుడు శ్రీధరణ్‌ సురేష్‌ (ఫైల్‌ ఫోటో)

అమీర్‌పేట: నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ పరిశోధన సంస్థలో పనిచేస్తున్న ఓ శాస్త్రవేత్తను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అనంతరం ఇంటి బయట తాళం వేసి పరారయ్యారు. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి అమీర్‌పేట్‌లో జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన శ్రీధరణ్‌ సురేష్‌ (56) అమీర్‌పేట్‌ ధరంకరం రోడ్డులోని అన్నపూర్ణ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌ నం ఎస్‌–2లో నివాసం ఉంటున్నాడు. బాలానగర్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ పరిశోధన సంస్థలో సురేష్‌ శాస్త్రవేత్తగా పనిచేస్తుండగా.. భార్య ఇందిర ఇండియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా.. కుమార్తె రమ్యకు వివాహం జరిగింది. 2005లో భార్య బదిలీపై తమిళనాడుకు వెళ్లడంతో సురేష్‌ ఒక్కడే నగరంలో ఉంటున్నాడు.

సోమవారం ఆఫీస్‌కు వెళ్లిన సురేష్‌ సాయంత్రం ఇంటికి వచ్చాడు. మంగళవారం ఉదయం పనిమనిషి లక్ష్మి వచ్చి చూడగా తాళం వేసి ఉండటంతో వెళ్లిపోయింది. సురేష్‌ డ్యూటీకి రాకపోవడంతో తోటి ఉద్యోగులు అతడికి కాల్‌ చేశారు. ఎంతకూ స్పందించకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా తాళం వేసి ఉండటంతో అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న అతడి బంధువులకు సమాచారమిచ్చారు. వారు భార్య ఇందిరకు సమాచారం అందించారు. ఆమె కుమార్తెతో కలసి నగరానికి వచ్చారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తాళాలు పగలగొట్టి లోపలకు వెళ్లి చూడగా సురేష్‌ విగతజీవిగా పడి కనిపించాడు. తల వెనుక, ముఖంపై లోతైన గాయాలు ఉండటాన్ని బట్టి హత్య చేసి.. అనంతరం బయటి నుంచి తాళం వేసి పారిపోయి ఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు. పోలీసు జాగిలం అపార్ట్‌మెంట్‌పై వరకు వెళ్లి తిరిగి వచ్చింది.

శ్రీనివాస్‌ ఎవరు..?
సురేష్‌ హత్యపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సురేష్‌ వద్దకు గత 2 నెలల నుంచి శ్రీనివాస్‌ అనే వ్యక్తి వచ్చి వెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు కలసి మద్యం సేవిస్తున్నట్లు తెలిసింది. దీంతో శ్రీనివాస్‌ ఎవరన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా