రాహుల్‌ గాంధీ ప్రత్యర్థి అరెస్ట్‌

22 Aug, 2019 17:13 IST|Sakshi

దుబాయ్‌: కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై పోటీచేసి ఓడిపోయిన ఎన్డీఏ అభ్యర్థి, భారత ధర్మ జనసేన(బీడీజీఎస్‌) అధ్యక్షుడు తుషార్‌ వెల్లపల్లి అరెస్ట్‌ అయ్యారు. ఓ చెక్‌ బౌన్స్‌ కేసులో తుషార్‌ను దుబాయ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అజ్మాన్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. అజ్మాన్‌లో స్థిరపడిన కేరళకు చెందిన వ్యాపారి నాసిల్‌ అబ్దుల్లా ఈ చెక్‌బౌన్స్‌ కేసు పెట్టాడు. 

అసలేం జరిగిందంటే..
తుషార్‌ వెల్లపల్లి కొంత మంది సన్నిహితులతో కలిసి దుబాయ్‌లో పదిహేనేళ్ల క్రితం ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ప్రారంభించారు. అయితే ఆ వ్యాపారంలో నష్టాలు వాటిల్లడంతో పదేళ్ల క్రితమే ఆ కంపెనీని అమ్మేశారు. ఆ సమయంలో నాసిల్‌ అబ్దుల్లాకు రూ. 19కోట్ల విలువ చేసే చెక్‌లు తుషార్‌ ఇచ్చారు. అయితే అంత డబ్బు బ్యాంకులో లేకపోవడంతో చెక్‌ బౌన్స్‌ అయింది. దీంతో పదేళ్ల నుంచి వేచి చూసిన నాసిల్‌ పక్కా ప్రణాళిక ప్రకారం తుషార్‌ను అజ్మాన్‌కు రప్పించి ఓ హోటల్లో దింపాడు. అప్పటికే స్థానిక పోలీసులకు అబ్దుల్లా ఫిర్యాదు చేయడంతో హోటల్‌కు చేరుకన్న పోలీసులు తుషార్‌ను అరెస్ట్‌ చేశారు. అయితే తుషార్‌ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అతడికి చట్టప్రకారమే కొంత ఉపశమనం కలిగేలా చూడాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాశారు.

మరిన్ని వార్తలు