ప్రసవం కోసం వచ్చిన పాపానికి...

16 Jun, 2018 09:10 IST|Sakshi
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హరిత 

ఉస్మానియాలో స్కానింగ్‌తో వెలుగులోకి

చావుబతుకుల మధ్య పోరాడుతున్న మహిళ

షాద్‌నగర్‌ ప్రైవేట్‌ ఆసుపత్రి వైద్యుల నిర్వాకం

షాద్‌నగర్‌టౌన్‌ : ప్రసవం కోసం ఓ మహిళ ఆసుపత్రికి వచ్చింది... వైద్యులు ఆమెకు ఆపరేషన్‌ చేశారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే వైద్యులు ఆపరేషన్‌ సమయంలో ఆమె కడుపుకోసి కాటన్‌తో మూసేసి కుట్టేశారు. ప్రస్తుతం బాధిత మహిళ హైదరాబాద్‌లోని ఓవైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చావుబతుకుల మధ్య పోరాడుతోంది.

బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు... రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం బొబ్బిలిగామ గ్రామానికి చెందిన హరిత అనే మహిళ నిండు గర్భిణి. 2017 అక్టోబర్‌ 3న కుటుంబ సభ్యులు ఆమెను ప్రసవం కోసం షాద్‌నగర్‌ పట్టణంలోని పరిగి రోడ్డులో బస్టాండ్‌ ఎదురుగా ఉన్న విజయ ఆసుపత్రికి తీసుకొచ్చారు.

ఆసుపత్రి వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి ఆపరేషన్‌ చేశారు. హరిత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్‌ అనంతరం హరిత స్వగ్రామానికి వెళ్లింది. ఆపరేషన్‌ నిర్వహించిన రోజు నుంచి హరిత ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో దిగులు చెందిన బాధితురాలి కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుప్రతికి తరలించారు.  

కాటన్‌ పేగులకు చుట్టుకుని అస్వస్థత.. 

ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులు హరితకు స్కానింగ్‌ నిర్వహించారు. కడుపులో కాటన్‌ ఉన్నట్లు గుర్తించి బాధితురాలి కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. ప్రసవం కోసం వచ్చినప్పుడు ఆపరేషన్‌ నిర్వహించి కడుపులో కాటన్‌ ఉంచి కుట్లు వేయడమే అస్వస్థతకు కారణమని వైద్యులు నిర్ధారించారు.

హరిత కడుపులో ఉన్న కాటన్‌ పేగులకు చుట్టుకొని పోవడంతో ఉస్మానియా వైద్యులు హరితకు మరోసారి ఆపరేషన్‌ చేసి కడుపులో ఉన్న కాటన్‌ను తొలగించారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని ఆసుపత్రి వైద్యులు పేర్కొంటున్నారు.

కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓవైసీ ఆసుప్రతిలో చేర్చగా అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతోంది. షాద్‌నగర్‌లోని విజయ ఆసుపత్రి వైద్యులు హరిత ఆపరేషన్‌ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  

పోలీసులకు ఫిర్యాదు  

హరిత కడుపులో కాటన్‌ ఉన్న విషయాన్ని తెలుసుకున్న బాధితురాలి సోదరుడు పి.రవి నిర్లక్ష్యంగా వ్యవహరించిన విజయ ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ షాద్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

షాద్‌నగర్‌లోని విజయ ఆసుపత్రి వైద్యులు హరితకు ఆపరేషన్‌ సమయంలో నిర్లక్ష్యంగా వ్యహరించారని, దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించిందని, ఉస్మానియా ఆసుపత్రిలో ఆపరేషన్‌ చేసి హరిత కడుపులో ఉన్న కాటన్‌ను తొలగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారిందని రవి తెలిపారు. దీనికి కారకులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని రవి పేర్కొన్నారు.

ఆపరేషన్‌ మా ఆసుపత్రిలో జరగలేదు 

హరితకు విజయ ఆసుపత్రిలో ఆపరేషన్‌ చేయ లేదు. కేవలం ఆమెకు ఓపీని మాత్రమే చూశాం. హరితను పరీక్షించిన అనంతరం ఆమెను హైదరాబాద్‌లోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలకు వెళ్లాలని సూచించాం. పట్టణంలోని సేవాలాల్‌ ఆసుపత్రిలో ఆపరేషన్‌ చేశారు. హరిత అనారోగ్యం పాలవడానికి మా ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదు.  – డాక్డర్‌ చందులాల్‌రాథోడ్, విజయ ఆసుపత్రి వైద్యుడు

కేసు నమోదు చేశాం 

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా హరిత అనారోగ్యానికి గురైందని వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశాం. హరితకు ఆపరేషన్‌ చేసే సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యహరించి ఆమె కడుపులో కాటన్‌ ఉంచి కుట్లు వేశారని బాధితురాలి సోదరుడు రవి విజయ ఆసుపత్రి వైద్యులు విజయ, చందూలాల్‌పై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నాం.

– అశోక్‌కుమార్, సీఐ, షాద్‌నగర్‌టౌన్‌

మరిన్ని వార్తలు