‘నిర్లక్ష్యపు’ నిప్పు

12 Mar, 2018 11:41 IST|Sakshi
గడ్డపోతారంలోని ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదం(ఫైల్‌)

రసాయన పరిశ్రమల్లో పేలుళ్లు

నిబంధనలు, జాగ్రత్తలు పాటించకపోవడమే కారణం

భారీగా ఆస్తినష్టం..కొన్ని సార్లు ప్రాణాలు కోల్పోతున్న కార్మికులు

 ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోని యాజమాన్యాలు

పట్టించుకోని అధికారులు

జిన్నారం(పటాన్‌చెరు): రసాయన పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో కోట్ల రూపాయల ఆస్థి నష్టంతో పాటు, కొన్ని సార్లు కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పరిశ్రమల యజమానులు కనీస నియమనిబంధనలను కూడా పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నయాన్న విమర్శలు ఉన్నాన్నాయి. ఎండాకాలంలో ప్రమాదాలు మరింతా పెరిగే ప్రమాదం ఉంది. జిన్నారం, గుమ్మడిదల మండలాల్లోని ఖజీపల్లి, బొల్లారం, గడ్డపోతారం, గుమ్మడిదల, అనంతారం, బొంతపల్లి పారిశ్రామిక వాడల్లో దాదాపు 200 రసాయన పరిశ్రమలు ఉన్నాయి.

వీటిలో 50 శాతానికి పైగా చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఇంటర్మీడియట్‌ ప్రొడక్టులను తయారు చేస్తుంటారు. తగిన రక్షణ పరికరాలు లేకపోవటంతో తరచూ వీటిలోనే అధికంగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగిన పరిశ్రమలకు అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రమాదం జరుగుతున్న సమయంలో సైతం ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ అధికారులు సంఘటనా స్థలానికి రాకుండా, ప్రమాదం జరిగిన తరువాత రోజు వచ్చి పరిశీలించటం ఆనవాయితీగా మారింది.

ప్రమాదం జరుగతున్న సమయంలో తీవ్రత తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించడానికి అధికారులు అందుబాటులో ఉండడం లేదు. పరిశ్రమల్లో ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాకర్టరీస్‌ అధికారులు సూచించిన మేర రక్షణ చర్యలు ఉండాలి. ఈ విషయాన్ని అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు.

ఇటీవల జరిగిన ప్రమాదాలు..
    - గడ్డపోతారంలోని ఓ పరిశ్రమలో నెల రోజుల క్రితం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. సకాలంలో స్పందించిన సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
    - బొల్లారంలోని ఓ రసాయన పరిశ్రమలో రెండు నెలల క్రితం కార్మికులు రసాయనాలను కలుపుతుండగా అగ్ని ప్రమాదం జరిగింది
    -   బొంతపల్లిలోని మరో పరిశ్రమలో రెండు నెలల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో కార్మికులకు గాయాలయ్యాయి. పరిశ్రమ పూర్తిగా దగ్ధం కావడంతో తీవ్ర ఆస్థినష్టం జరిగింది.
   -  అనంతారంలోని మరో చిన్నతరహా పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులుతీవ్రంగా గాయపడగా, భారీ ఆస్థి నష్టం జరిగింది.
    - ఇటీవల గుమ్మడిదలోని మహాసాయి రసాయన పరిశ్రమలో రసాయనాలను దింపుతుండగా స్పార్క్‌ వచ్చి ప్రమాదం జరిడంతో రూ. 30 కోట్ల వరకు ఆస్థినష్టం జరిగింది. పరిశ్రమ పూర్తిగా దగ్ధమైంది.

నిపుణులైన కార్మికులు లేకే..?
రియాక్టర్‌ల వద్ద అనుభవం ఉన్న నిపుణులైన కార్మికులతో పనులు చేయించాల్సి ఉంటుంది. వీరికి అధిక మొత్తంలో వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ యాజమాన్యాలను అనుభవం లేని కార్మికులతో పనులు చేయిస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. రసాయనాలను కలపడం, దిగుమతి చేస్తున్న సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.  

ఎండాకాలం మరింత జాగ్రత్త అవసరం..
ఎండాకాలంలో రసాయన ప్రతి చర్యలు అధికంగా జరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఏటా పారిశ్రామిక వాడల్లో దాదాపు 30  ప్రమాదాలు జరిగితే అందులో 20 వరకు ఎండాకాలంలో జరిగినవే ఉంటాయి. 

అగ్నిమాపక కేంద్రం లేక..
పారిశ్రామిక వాడల్లో అగ్నిమాపక కేంద్రాలు లేకపోవటంతో ప్రమాదం జరిగిన సమయంలో ఆస్థినష్టం అధికమవుతోంది. గుమ్మడిదల, జిన్నారం మండలాల్లోని పారిశ్రామిక వాడల్లో ఎమైనా ప్రమాదాలు జరిగితే పటాన్‌చెరు, జీడిమెట్ల, నర్సాపూర్, బీహెచ్‌ఈఎల్‌ల నుంచి అగ్నిమాపక వాహనాలు రావాల్సిన పరిస్థితి. గడ్డపోతారం పారిశ్రామిక వాడకు హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి వచ్చిన సమయంలో ఈ ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకుంటామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా విషయం కార్యరూపం దాల్చలేదు. 

తెలియని ప్రమాదాలు ఎన్నో..
మల్టీనేషన్‌ కంపెనీల్లో జరుగుతున్న ప్రమాదాల విషయం బయటకు రావటం లేదు. వాటిల్లో ప్రమాదాలు జరిగినా అప్పటికప్పుడు మంటలను ఆర్పివేసేలా విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని సంఘటనల్లో కార్మికులు మృతి చెందినా విషయం బయటకు రానివ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. 

చర్యలు తీసుకుంటున్నాం
రసాయన పరిశ్రమల్లో అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకునేలా యజమాన్యాలకు సూచనలు చేస్తున్నాం. నిబంధనలను పాటించని పరిశ్రమలపై చర్యలు తీసుకోవడంతో పాటు, నోటీసులు అందిస్తున్నాం. ఇటీవల గుమ్మడిదలలో జరిగిన ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాం.
– రాజ్‌గోపాల్, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ప్యాక్టరీస్‌ అధికారి

మరిన్ని వార్తలు