ఆ కారు ఎవరిది.?

10 May, 2019 08:35 IST|Sakshi

చోరీ అనంతరం తెల్లకారులో నిందితుల పరారీ

కవాడిగూడ మీదుగా అదృశ్యం

పాత వాచ్‌మెన్‌ కుటుంబ సభ్యుల విచారణ

హిమాయత్‌నగర్‌: హియాయత్‌ నగర్‌లో జరిగిన చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.   ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన నేపాలీలు అనంతరం తెల్లకారులో పరారైనట్లు రోడ్డుపై ఉన్న సీసీకెమెరాల ద్వారా గుర్తించగలిగారు. బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగిన గల్లీలో నుంచి బయటికి వచ్చిన తెల్ల రంగుకారు అశోక్‌నగర్‌ మీదుగా కవాడిగూడ వైపు వెళ్లింది. ఆ తర్వాత ఎటువెళ్లిందనే దానిపై ఆధారాలు దొరకడం లేదు.   ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి హిమాయత్‌నగర్‌ స్ట్రీట్‌–11లో చోరీ  అనంతరం ఆ గల్లీ నుంచి హెమ్‌స్టెక్‌ ఫ్యాషన్‌ ఇనిస్టిట్యూట్‌ మీదుగా అశోక్‌నగర్‌ నాలా వద్దకు వచ్చిన వైట్‌ కలర్‌ ‘ఐ–10’ కారు పక్కాగా నేపాలీలదేనని పోలీసుల విచారణలో వెల్లడైంది.  అశోక్‌నగర్‌ మీదుగా కవాడిగూడకు వచ్చిన ఈ కారు అక్కడి నుంచి అదృశ్యమైంది. నగర వ్యాప్తంగా పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, కాలనీల్లో ‘మేము సైతం’లో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఉన్నా వాటిలో కారు వివరాలు ఎక్కడా రికార్డు కాలేదు.

అయితే కారు నంబర్‌ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నాలు చేయకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.      నగరంలో సంచలనం సృష్టించిన ఈ చోరీ ఘటనపై పోలీసు శాఖ అప్రత్తమైంది. ఈ నేపథ్యంలో గతంలో అదే ఇంట్లో వాచ్‌మెన్‌గా పని చేసి, వీరిని కుదిర్చిన నవీన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నవీన్‌ ఫోన్‌ నంబర్‌కు పోలీసులు ఫోన్‌ చేయగా అతడి కుమారుడు సమాధానం ఇచ్చాడు. అయితే పోలీసులు ఫోన్‌ చేసిన విషయాన్ని గుర్తించిన అతను అప్పటినుంచి ఫోన్‌ను స్విచ్చాఫ్‌ చేశాడు. సిగ్నల్‌ ఆధారంగా అత ను బంజారాహిల్స్‌ రోడ్‌నెంబర్‌–12లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లగా అతను అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో అతని భార్య, బంధువులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. వీరి నుంచి సరైన సమాధానాలు అందనట్లు సమాచారం. కాగా నిందితుల చిత్రా లు రైల్వే స్టేషన్లు, బస్‌ స్టాండ్లు, ఎయిర్‌ పోర్టు ల వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో ఎక్కడా రికార్డు కాకపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చోరీ చేసిన ప్రాంతం నుంచి కారులో వెళ్లి న వీరు రోడ్డు మార్గంలో నేపాల్‌ వెళ్లేందుకు యత్నిస్తున్నారా? లేదా చోరీకి వినియోగించిన కారును ఇక్కడే వదిలేసి మరో కారులో వెళుతున్నారా అనే అంశాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. 

మరిన్ని వార్తలు