విభేదాలే కిడ్నాప్‌కి కారణమా..?

9 Jul, 2020 15:44 IST|Sakshi

ముగ్గురు దుండగులు పాల్గొన్నట్లుగా అనుమానాలు

నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు

సాక్షి, విశాఖపట్నం: ఫైనాన్స్ వ్యాపారి అప్పలరాజు కిడ్నాప్, దాడి వ్యవహారంలో ముగ్గురు దుండగులు పాల్గొన్నట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితులు మంకీ క్యాంప్లు ధరించారని వ్యాపారి అప్పలరాజు తెలిపారు. దాడిలో ఆయన శరీరంపై రెండు చోట్ల కత్తిగాట్లు పడ్డాయి. వ్యాపార లావాదేవీలలో విభేదాలే కిడ్నాప్కి కారణమా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల‌ను పట్టుకోవడానికి సీపీ ఆర్కే మీనా నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కిడ్నాప్ కేసును స్వయంగా పర్యవేక్షించాలని డీసీపీ ఐశ్వర్య రస్తోగిని సీపీ ఆదేశించారు.

బుధవారం కైలాష్ పురానికి చెందిన లాలం అప్పలరాజు అనే ఫైనాన్స్‌ వ్యాపారిని  ద్వారకా నగర్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉండగా ఆటోలో వచ్చిన దుండగులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. సాగర్ నగర్ శివారులో తీవ్రంగా కొట్టిన దుండగులు.. బంగారం ఆభరణాలు, నగదు దోచుకుని అప్పలరాజును విడిచిపెట్టారు. గాయపడిన ఆయనను కుటుంబసభ్యులు కేజీహెచ్‌లో చేర్పించారు.

కిడ్నాప్‌ కేసులు చేధిస్తాం: సీపీ ఆర్కే మీనా
విశాఖలో జరిగిన రెండు కిడ్నాప్‌లపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సీపీ ఆర్కే మీనా వెల్లడించారు. రెండు కేసుల్లో నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడానికి 8 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. రెండు కేసుల్లోనూ పలు అనుమానాలున్నాయని సీపీ చెప్పారు. వ్యాపార లావాదేవీల్లో ఏర్పడిన వివాదాలే ప్రధాన కారణంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఫైనాన్స్ వ్యాపారి అప్పలరాజుపై దాడిలో అనేక అనుమానాలున్నాయని, రెండు రోజుల్లో రెండు కిడ్నాప్‌ కేసులను చేధిస్తామని సీపీ ఆర్కే మీనా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు