స్నేహితుని సాయంతో అంతం?

18 Feb, 2019 05:42 IST|Sakshi
బకింగ్‌హామ్‌ కెనాల్‌లో అయస్కాంతంతో వెదికేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు

పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చినందుకే హతమార్చే కుట్ర

జ్యోతి హత్య కేసులో కొత్త కోణం

శ్రీనివాస్‌ స్నేహితుడిని విచారిస్తున్న పోలీసులు

అసభ్యకర ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరించినట్టు ఆరోపణలు 

సాక్షి, గుంటూరు/ తాడేపల్లి రూరల్‌: అంగడి జ్యోతి హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈనెల 11న మంగళగిరి నవులూరు సమీపంలోని అమరావతి టౌన్‌షిప్‌లో అంగడి జ్యోతి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో జ్యోతి ప్రియుడు శ్రీనివాసరావు పాత్రపై వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా శనివారం అర్ధరాత్రి పోలీసులు శ్రీనివాసరావు స్నేహితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించినట్టు సమాచారం. జ్యోతిని వదిలించుకునే ఆలోచనతో స్నేహితుల సాయంతో శ్రీనివాసరావే ప్రణాళిక ప్రకారం హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆధారాల కోసం పోలీసులు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు.  

ఆ యువకుడి బైక్‌ పైనే అమరావతి టౌన్‌షిప్‌కు..
తన బైక్‌ పైనే 11న జ్యోతిని శ్రీనివాసరావు అమరావతి టౌన్‌షిప్‌కు తీసుకువెళ్లినట్టు శ్రీనివాసరావు స్నేహితుడు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. హత్య జరగడానికి కొన్ని రోజుల ముందు నుంచి పెళ్లి విషయంలో శ్రీనివాస్, జ్యోతిల మధ్య గొడవలు జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా అతను వెల్లడించాడు. పెళ్లి చేసుకోవాలని జ్యోతి తీవ్ర ఒత్తిడి చేస్తుండటంతో ఆమెకు సంబంధించిన అసభ్యకర ఫొటోలను సోషల్‌ మీడియాలో పెడతానని శ్రీనివాసరావు జ్యోతిని బెదిరించేవాడని, అయినా సరే జ్యోతి పెళ్లి గురించి ఒత్తిడి చేసేదని అతను చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతి అడ్డు తొలగించుకోవాలని శ్రీనివాస్‌ ఆమెను నమ్మించి అమరావతి టౌన్‌షిప్‌కు రప్పించాడని చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం.

తాడేపల్లి పరిధిలోని మహానాడు ప్రాంతంలో నివసించే ఇద్దరు యువకులను ఆదివారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అందులో ఓ యువకుడు శ్రీనివాసరావు ప్రణాళిక ప్రకారమే హత్య చేశామని ఒప్పుకొన్నట్లు సమాచారం. తాను జ్యోతితో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో వెనుకనుంచి వచ్చి దాడికి పాల్పడాలని ప్రణాళిక వేసినట్లు అతని స్నేహితుడు పోలీసులకు వెల్లడించాడని సమాచారం. ముందుగా తనపై రాడ్‌తో దాడిచేసి, అనంతరం జ్యోతిపై దాడి చేయాలన్న శ్రీనివాసరావు ప్రణాళిక ప్రకారమే చేశామని, అనంతరం ఆ రాడ్‌ను బకింగ్‌హామ్‌ కెనాల్‌లో పడవేశామని అతను చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు తాడేపల్లి పరిధిలోని సీతానగరం, కొత్తూరు రైల్వే బ్రిడ్జి కింద భాగంలో బకింగ్‌హామ్‌ కెనాల్‌ లాకులు మూయించిన ఉదయం, సాయంత్రం రెండు విడతలుగా గజ ఈతగాళ్లతో గాలించారు. అయినా రాడ్డు లభించలేదు. కాగా కేసు దర్యాప్తులో కీలక ఆధారాలైన జ్యోతి సెల్‌ఫోన్, హ్యాండ్‌ బ్యాగ్‌ల జాడ నేటికీ లభించలేదు. 

మరిన్ని వార్తలు