కామారెడ్డి నుంచి ‘సిమ్‌’లు

21 Nov, 2019 05:23 IST|Sakshi
పోలీసులకు పట్టుబడిన నిందితులు

పాక్‌ వలపు వల కేసులో కొత్తకోణం

ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో వెలుగుచూసిన హనీట్రాప్‌ (వలపు వల) కేసు లో కొత్తకోణాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసు మూలాలు కామారెడ్డిలో ఉన్నా యని పోలీసులు గుర్తించారు. భారత ఆర్మీ అధికారులే లక్ష్యంగా పాకిస్తాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ విసిరిన వలపువల హైదరాబాద్‌లో బట్టబయలైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబం ధించి బుధవారం ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లా పొల్కంపేటకు చెందిన మహమ్మద్‌ వాహెద్‌ పాషా, మహమ్మద్‌ అహ్మద్‌ పాషా అనే సోదరులు, మెదక్‌కు చెందిన మహమ్మ ద్‌ నవీద్‌ పాషాలను అరెస్టు చేశారు.

ఈ ముగ్గురిలో అన్నదమ్ములిద్దరూ సిమ్‌కార్డులు విక్రయించే ఔట్‌లెట్‌ నిర్వాహకులు. నవీద్‌ ఓ ప్రముఖ సెల్‌ఫోన్‌ కంపెనీలో టెలికం మేనేజర్‌. వీరు ముగ్గురూ ఈ కేసులో ప్రధాన నిందితులైన మహ్మద్‌ ఇమ్రాన్‌ఖాన్, మహమ్మద్‌ జాఫర్‌లకు సిమ్‌కార్డులు సరఫరా చేసినట్లు గుర్తించామని సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రుద్రభాస్క ర్, డీఐ ప్రసాదరావు బుధవారం మీడి యాకు తెలిపారు. కాగా, విదేశాల నుంచి వచ్చే కాల్స్‌ను వీఓఐపీ సాంకేతికతతో లోకల్‌కాల్స్‌గా మార్చడంతో తమ సంస్థ ఆదాయానికి భారీగా గండిపడిందని బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ పేర్కొంది. ఈ మేరకు బుధవారం చాంద్రాయణగుట్ట పోలీసులకు బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ టెక్నికల్‌ అధికారులు ఫిర్యాదు చేశారు.

ఎలా చేశారంటే? 
పాషా సోదరుల వ్యాపారంలో పెద్దగా లాభాల్లేవు. సిమ్‌కార్డులు సమకూరిస్తే రెట్టింపు డబ్బులు ఇస్తానని నవీద్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో ఒక్కో సిమ్‌కార్డును రూ.300 చొప్పున 160 సిమ్‌కార్డులు విక్రయించారు. తమ వద్ద సిమ్‌లు తీసుకున్న వారి ధ్రువీకరణ పత్రాలతోనే కొత్త సిమ్‌కార్డులు యాక్టివేట్‌ చేశారు. సదరు సిమ్‌లను నవీద్‌ తీసుకెళ్లి రూ.500ల చొప్పున ఇమ్రాన్‌ఖాన్‌కు విక్రయించాడు. వీటితోనే హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట ఇస్మాయిల్‌నగర్‌ సమీపం లోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ టెక్నాలజీతో ప్రైవేటు టెలిఫోన్‌ ఎక్సే్చంజ్‌ని ఏర్పాటు చేశాడు. అలా అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్‌ కాల్స్‌గా మారుస్తూ.. స్థానిక టెలికం కంపెనీల ఆదాయానికి గండికొట్టాడు. పాకిస్తాన్‌ నుంచి వచ్చే కాల్స్‌ను ఆర్మీ అధికారులకు మళ్లించడం గుర్తించడంతో వీరి వ్యవహారం వెలుగుచూసింది. ప్రధాన నిందితులైన మహ్మద్‌ ఇమ్రాన్‌ఖాన్, మహమ్మద్‌ జాఫర్‌ పరారీలో ఉండగా.. ఈ కేసులో ఇమ్రాన్‌ భార్య రేష్మాసుల్తానాపైనా పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు