దొంగతనాల్లో నయా ట్రెండ్‌!

2 Mar, 2018 13:30 IST|Sakshi
ఇళ్లల్లో జరిగిన దొంగతనం తీరును పరిశీలిస్తున్న పోలీస్‌ (ఫైల్‌)

కనిపెడుతూనే ఉంటారు

అదును చూసి మోసం చేస్తారు

ఏమరుపాటుగా ఉంటే అంతే..

పట్టపగలే మోసాలకు తెర తీస్తున్నారు...  

విజయనగరం టౌన్‌: దొంగలు తమ చేతివాటాన్ని చూపడంలో  కొత్త పుంతలు తొక్కుతున్నారు. పగలు, రాత్రి తేడాల్లేకుండా ఇళ్లల్లో దూరి దొంగతనాలకు పాల్పడుతున్నారు. దాహం వేస్తుందనో, ఆకలేస్తుందనో రావడం  పరిసరాలను పరిశీలించడం, కొన్ని రోజుల పరిశీలన తర్వాత దొంగతనాలకు దిగడం చేస్తున్నారు.  బ్యాంకుల వద్ద, పోస్టాఫీసుల వద్ద  వృద్ధులను, మహిళలను పరి శీలించడం, వారు డబ్బులు పట్టుకెళ్లినప్పుడు,  సాధారణంగా నిత్యం వచ్చే వారిని చూడటం అదును చూసి దెబ్బకొట్టడం ప్రస్తుతం నడుస్తున్న నయా ట్రెండ్‌.  వ్యసనాలకు అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న దొంగలు జిల్లా వ్యాప్తంగా హల్‌చల్‌ చేస్తున్నారు.  ఎక్కడికక్కడ సీసీ పుటేజీలు పరి శీలన ఉన్నప్పటికీ, జిల్లా పోలీస్‌ యంత్రాగం చర్యలు చేపడుతున్నా, వీరి ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు.  ప్రధానంగా పట్టణ శివారు ప్రాంతాల్లో నివాసముండేవారిపైనా, పాఠశాలలకు వచ్చే మహిళలపైన, వృద్ధులను వీరు లక్ష్యం చేస్తున్నారు. 

ఏమరపాటుగా ఉంటే అంతే...
ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా మత్తుమందు చల్లి, ఇతరత్రా పద్ధతుల ద్వారా ఒంటిమీద నగలన్నీ గుంజుకుపోతారు. పాఠశాలలకు వెళ్లే మహిళలు మెడలో హారాలు, నగలు తెంపుకొని పోతున్నారు.   చైన్‌ స్నాచింగ్‌ బ్యాచ్‌లో  20 నుంచి 30 ఏళ్లలోపు యువకులే ఎక్కువగా ఉంటున్నారు.  

ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద  పర్సులో పది వేలు, నగలు పట్టుకుని పెళ్లికి వెళ్లేందుకు  ఆటో ఎక్కిన ఓ మహిళకు కోట జంక్షన్‌ వద్దకు రాగానే , ఇద్దరు మహిళలు ఆటోలో ఎక్కారు. అంబటిసత్రం జంక్షన్‌ రాగానే ఆ ఇద్దరూ  దిగిపోయారు.  పెళ్లికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన మహిళ తన ప్రదేశం రాగానే దిగిపోయి, కొంత దూరం వెళ్లి బ్యాగ్‌లో పర్సు చూసేసరికి మాయమైంది.  లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది.
బ్యాంకులో  రూ.25వేలు  విత్‌ డ్రా చేసుకుని  సైకిల్‌కి తగిలించి వెళ్తున్న ఓ వృద్ధుడిని ఎప్పటి నుంచో గమనిస్తున్న ఇద్దరు వ్యక్తులు,  వృద్ధుడ్ని మాటల్లో పెట్టి సైకిల్‌కి తగిలించిన సంచితో  ఉడాయించారు. వృద్ధుడు టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించాడు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
దొంగతనాల జోరును అరికట్టాలంటే ప్రజలు  అప్రమత్తంగా ఉండాలి. అందుబాటులో ఉన్న పోలీస్‌స్టేషన్‌కి సంబంధించిన  ఫోన్‌ నెంబర్, అడ్రస్‌  ఆ ప్రాంతవాసులందరి వద్ద ఉంచుకోవాలి. లేదా డయల్‌ 100కి ఫోన్‌ చేసి వివరాలు చెప్పాలి.  ఎవరైనా ఇళ్లు తాళం వేసి ఊర్లకు వెళ్లినా సమాచారమందించాలి.  గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినా  వెంటనే పోలీసులను ఆశ్రయించాలి.
– బివిజె.రాజు, టూటౌన్‌ సీఐ, విజయనగరం

మరిన్ని వార్తలు