కాల్పుల్లో కొత్తకోణం.. సినిమాలో చూసి ఫైరింగ్‌

11 Feb, 2020 02:40 IST|Sakshi

అక్కన్నపేట కాల్పుల్లో కొత్తకోణం

సదానందానికి ఆయుధాలంటే పిచ్చి

ఆ పిచ్చితోనే ఠాణాలో చోరీ.. ఖాళీ తుపాకీతో సాధన

గన్‌ అదృశ్యం దర్యాప్తుపై కానరాని స్పష్టత

సాక్షి, హైదరాబాద్‌: సిద్ధిపేట కమిషనరేట్‌ పరిధిలోని అక్కన్నపేట కాల్పుల కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. 2016లో హుస్నాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి ఏకే–47 చోరీచేసిన సదానందం ఇంతకాలం ఎలా మెయింటైన్‌ చేశాడన్న విషయంపై పోలీసులు కూపీలాగుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సదానందం విపరీత, సున్నిత మనస్తత్వమున్నవాడు. ఆయుధాలన్నా, తుపాకులన్నా పిచ్చి. ఈ పిచ్చే ఠాణాలో తుపాకులు చోరీచేసే వరకూ తీసుకెళ్లింది. వీటిని దొంగిలించాక ఇంట్లోనే దాచి, ఎవరూలేని సమయంలో చూసుకుని మురిసిపోయేవాడు. సినిమాలు, యూట్యూబ్‌లు చూసి ఏకే–47 ఎలా ఫైర్‌ చేయాలో తెలుసుకున్నాడు. బుల్లెట్లు, ట్రిగ్గర్‌ పాడవకుండా కొబ్బరినూనెతో తుడిచేవాడు. బుల్లెట్లు లేకుండా ఏకే–47 ట్రిగ్గర్‌ నొక్కుతూ మురిసిపోయేవాడు. ఇలా ఏకే–47 ఫైర్‌ చేయడం నేర్చుకున్నాడు.

వెలుగులోకి వచ్చింది ఇలా...
ఏకే–47 ఆయుధాన్ని తెలంగాణలో జిల్లాల పునర్విభజనకు ముందే చోరీ చేశాడు. తన పాత కేసుల క్రమంలో తరచూ హుస్నాబాద్‌ స్టేషన్‌కి వెళ్లివచ్చే సదానందం దృష్టిని అక్కడి ఆయుధాలు ఆకర్షించాయి. ఏకే–47, కార్బైడ్‌లను చోరీ చేశాడు. ఆయుధాల చోరీ విషయాన్ని పోలీసులు దాచిపెట్టడంతో చాలాకాలం ఇది వెలుగులోకి రాలేదు. గతంలో హుస్నాబాద్‌ జిల్లా ఉమ్మడి కరీంనగర్‌ పరిధిలో ఉండేది. 2016, అక్టోబర్‌లో జిల్లాల పునర్విభజన అనంతరం డిసెంబర్‌లో సిద్ధిపేట జిల్లాలోని పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోకి వెళ్లిపోయింది. అదే ఏడాది డిసెంబర్‌లో ఆయుధాలను కమిషనరేట్‌కి లెక్కచూపే క్రమంలో ఏకే–47 మిస్సింగ్‌ విషయం వెలుగుచూసింది. దీంతో అప్పటి సీఐ గన్‌మెన్‌పై కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. అక్కన్నపేట కాల్పుల తరువాతే 9ఎంఎం కార్బన్‌గన్‌ కూడా పోయిన విషయం వెల్లడికావడం గమనార్హం.

తుపాకీ పోగొట్టుకుంటే..?
పోలీసుల తుపాకులు కనిపించకుండా పోతే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వెంటనే రాష్ట్ర పోలీసులు ఈ సందేశాన్ని రేడియో ద్వారా ఇండియాలోని అన్ని స్టేషన్‌లకు పంపుతారు. ఈ విషయంలో స్థానిక ఎస్పీ లేదా కమిషనర్‌ ఒక డీఎస్పీ స్థాయి అధికారిని విచారణాధికారిగా నియమిస్తారు. సదరు అధికారి ఆయుధం ఎలాంటి పరిస్థితుల్లో పోయిందో దర్యాప్తు చేస్తారు. నిర్లక్ష్యం వహించినట్లు తేలితే వెంటనే కేసు నమోదు చేసి, సస్పెండ్‌ చేస్తారు. అంతేగాకుండా ఈ విషయాన్ని తరువాత లిఖిత పూర్వకంగా కేంద్రహోంశాఖతోపాటు రాష్ట్రం, దేశంలోని అన్ని పోలీస్‌ఠాణాలకు పంపుతారు. కాగా, గతంలో హుస్నాబాద్‌ ఠాణాలో పనిచేసిన సీఐ భూమయ్య, సీఐ శ్రీనివాస్‌ల హయాంలో ఈ ఆయుధాలు మాయమయ్యాయన్న విషయంలో స్పష్టత కరువైంది. అలాగే కార్బన్‌ వెపన్‌ మిస్సింగ్‌ విషయంలోనూ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. స్టేషన్‌ నుంచి 25 రౌండ్ల బుల్లెట్లతో ఉన్న ఏకే–47 వెపన్‌ను ఎత్తుకెళితే ఎందుకు గుర్తించలేకపోయారు. స్టేషన్‌లో సీసీ కెమెరాలు లేవా? సంబంధిత గన్‌మెన్‌ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఎందుకు చెప్పలేదు? అంతటి మారణాయుధం పోయినా.. తూతూమంత్రంగా దర్యాప్తు జరపడం ఏంటి? ఇలాంటి అనేక ప్రశ్నలకు పోలీసుల నుంచి సమాధానం లేదు.

వారంలో రెండు కాల్పుల ఘటనలు..
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఒకే వారంలో రెండు కాల్పుల ఘటనలు ప్రజలను ఉలిక్కిపడేలా చేశాయి. ఫిబ్రవరి 1న జగిత్యాల సమీపంలోని గొల్లపల్లి మండలం ఎస్రాజ్‌పల్లిలో శ్రీనివాస్‌(మాజీ మావోయిస్టు) తుపాకీతో హల్‌చల్‌ చేశాడు. భార్య కాపురానికి రావడం లేదన్న కారణంతో అత్తగారింటిపై దాడి చేసి, అడ్డుకున్న రాజిరెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఫిబ్రవరి 6న అక్కన్నపేటలో సదానందం కాల్పులు జరపడం కలకలం రేపింది.
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు