యాంకర్‌ ఆత్మహత్య కేసులో మలుపు

19 Jun, 2018 09:57 IST|Sakshi
మట్టపల్లి తేజస్విని (ఫైల్‌)

నమ్మి వచ్చినందుకు వేధించాడు

ప్రవర్తన నచ్చలేదంటూ సూసైడ్‌నోట్‌

498ఎ, 306 సెక్షన్‌ల కింద కేసు మార్పు

కృష్ణా,  కంకిపాడు:  వివాహిత ఆత్మహత్య కేసులో మలుపు చోటుచేసుకుంది. తన భర్త ప్రవర్తన నచ్చక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మృతురాలు తేజస్విని సూసైడ్‌ నోట్‌ రాసింది. ఈ నోట్‌ పోలీసులకు లభ్యం కావటంతో అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును 498ఏ, 306 సెక్షన్‌ల కింద మార్పు చేస్తూ సోమవారం సాయంత్రం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన తేజస్విని (26) ఐదేళ్ల క్రితం మట్టపల్లి పవన్‌కుమార్‌ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. తేజస్విని విజయవాడలోని ఓ ప్రైవేటు చానల్‌లో న్యూస్‌ రీడర్‌గానూ, పవన్‌కుమార్‌ ఉయ్యూరులోని బజాజ్‌ రిలయన్స్‌లో పనిచేస్తున్నారు. ఈనెల 16వ తేదీ రాత్రి అనుమానాస్పద స్థితిలో ఈడుపుగల్లులోని ఎంబీఎంఆర్‌ కాలనీలోని అద్దె ఇంట్లో ఉరివేసుకుని తేజస్విని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు అర్థరాత్రి సమయంలో ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కేసులో సెక్షన్‌లు మార్పు
తేజస్విని ఆత్మహత్యపై తొలుత 174 సెక్షన్‌ కింద అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. చనిపోయే ముందు తేజస్విని రాసిన సూసైడ్‌ నోట్‌ పోలీసులకు లభ్యమైంది. మృతురాలి తల్లి మంగళగిరి వెంకటరమణమ్మ తన కుమార్తెను ఐదేళ్ల కిందట పవన్‌కుమార్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, ఆత్మహత్యకు గల కారణాలు తెలీదని, విచారించాలని అదేరోజు రాత్రి ఫిర్యాదులో పేర్కొంది. ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఫేస్‌బుక్, ఈమెయిల్స్‌ను ఆమె ల్యాప్‌టాప్‌లో పరిశీలించారు. ‘ప్రేమించి, నమ్మి వచ్చినందుకు వేధించాడని, ఇబ్బందులు పెడుతున్నాడని, స్నేహితులే ఎక్కువ అయ్యారని, తనను పట్టించుకోవటం లేదని, ప్రవర్తన సరిగా లేదని అందుకే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు’ సూసైడ్‌ నోట్‌లో తేజస్విని పేర్కొన్నట్లు సమాచారం. విజయవాడ ఈస్ట్‌ జోన్‌ ఏసీపీ విజయభాస్కర్‌ సోమవారం స్థానిక పోలీసుస్టేషన్‌ను సందర్శించి వివరాలు సేకరించారు. ఈడుపుగల్లులోని ఘటనాస్థలానికి వెళ్లి విచారణ జరిపారు.

ఈ నేపథ్యంలో 498ఎ, 306 సెక్షన్‌ల కింద కేసులో మార్పులు చేసి దర్యాప్తు చేపట్టారు. తేజస్విని భర్త పవన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే మధ్యాహ్నం వరకూ మృతురాలి కుటుంబ సభ్యులు, పవన్‌కుమార్‌ కుటుంబ సభ్యులతో పోలీసుస్టేషన్‌ వద్ద రాజీ మంతనాలు జరిగినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు