భర్తకు మజ్జిగలో విషం.. షాకింగ్‌ ట్విస్ట్‌!

20 Nov, 2019 19:50 IST|Sakshi

కొత్త పెళ్లి కూతురు భర్తను చంపేందుకు నిజంగా ప్రయత్నం చేసిందా? మజ్జిగలో నవవధువు పురుగుల మందు కలిపిందా? అదే నిజమైతే ఆ యువతి భర్తతోపాటే ఆసుపత్రికి ఎందుకు పరుగులు తీస్తుంది? నిజంగా చంపే ఉద్దేశం ఉంటే మజ్జిగలోనే ఎందుకు విషం కలుపుతుంది? పెళ్లైన వారానికే మజ్జిగలో విషం కలిపిందంటూ వెలుగులోకి వచ్చిన కేసుకు సంబంధించి యువతి కుటుంబసభ్యులు అడుగుతున్న ప్రశ్నలివి. మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే ఆ కొత్త పెళ్లికొడుకే వివాహబంధం నుంచి బయటపడేందుకు కొత్త నాటకం ఆడాడన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

పెళ్లి జరిగిన వారానికే భర్తను చంపేందుకు యువతి మజ్జిగలో విషం కలిపిందన్న వార్త తీవ్ర సంచలనం సృష్టించింది. పెళ్లి ఇష్టం లేనందువల్ల మజ్జిగలో విషం కలిపి భర్తను హత్య చెయ్యాలని చూసిందంటూ వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేగింది. అయితే ఈ కేసు ఇప్పుడు ఎవరూ ఊహించని మలుపు తిరిగింది. అయ్యో పాపం అన్న భర్తను ఇప్పుడు అమ్మో.. అంత పని చేశాడా అంటున్నారు. వివాహ బంధం నుంచి తప్పించుకునేందుకు భర్తే ఈ విషపు ఆలోచన చేశాడంటూ అమ్మాయి తరఫువారు కారాలు మిరియాలు నూరుతున్నారు.

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన లింగమయ్యకు.. నవంబర్ 11న మద్దికెర మండలం మందనంతపురానికి చెందిన నాగమణితో వివాహమైంది. వారం రోజుల తర్వాత భార్యతో కలిసి ఆమె పుట్టింటికి వెళ్లాడు లింగమయ్య.. అదే రోజు సాయంత్రం తన భార్య మజ్జిగలో విషం కలిపి ఇచ్చిందంటూ లింగమయ్య అనంతపురం ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయం బయటికి పొక్కడంతో మీడియాలో ఈ వార్త సంచలనంగా మారింది. అందుకు కారణం లింగమయ్య చెప్పిన కారణం. పెళ్లి ఇష్టం లేనందువల్ల భార్య తనకు పురుగుల మందు కలిపిన మజ్జిగ ఇచ్చిందంటూ.. ఆ మజ్జిగ గ్లాసును కూడా అతను అందరికీ చూపించాడు. దీంతో అంతా నిజమేనని భావించారు. అయితే, కొత్తపెళ్లికూతురు నాగమణి కుటుంబ సభ్యుల వాదన మరోలా ఉంది. భర్తకు ఇచ్చిన మజ్జిగను ముందుగా తాను తాగిందనీ, పురుగుల మందు కలిపి ఉంటే ఎలా తాగుతుందంటున్నారు. ఆమెకు భర్తను చంపాల్సిన ఉద్దేశం ఎంతమాత్రమూ లేదంటున్నారు. పెళ్లైనప్పటి నుంచి ముభావంగా ఉంటున్న లింగమయ్య.. భార్యతో కాపురం చెయ్యలేక ఈ నాటకం మొదలు పెట్టాడంటున్నారు. లింగమయ్య తాగిన పురుగుల మందు ఎక్కడ కొన్నారో తామే పోలీసులకు చెప్తామని ధీమాగా చెబుతున్నారు. తమ బిడ్డ జీవితాన్ని నాశనం చేసిన లింగమయ్యను వదిలే ప్రసక్తే లేదంటున్నారు. లింగమయ్య తాను తాగిన మజ్జిగ గ్లాసును చూడండి అంటూ అందరికీ చూపుతుండటం అనుమానాలకు తావిస్తోంది. పక్కా పథకం ప్రకారమే లింగమయ్య భార్యపై నేరం మోపే నాటకం ఆడుతున్నాడని నాగమణి బంధువులంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా