కోట మరణం... కొత్త కోణం‌!

25 Nov, 2017 08:42 IST|Sakshi

జైపూర్‌ : నహర్‌గఢ్‌ ప్రహారీ గోడకు వేలాడుతున్న వ్యక్తి దేహం నిన్న కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే చేతన్‌ కుమార్‌ సైనీ(40) మరణానికి సంబంధించి కీలక ఆధారాలు ఇప్పుడు పోలీసుల కంట పడ్డాయి. ఇది మతపరమైన హత్య అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

మృతదేహాం పక్కనే తొలుత అక్కడి కోట గోడ రాత ఆధారంగా అది పద్మావతి చిత్ర యూనిట్‌ బెదిరింపు రాతలు అని అంతా అనుకున్నారు. కానీ, దర్యాప్తులో అక్కడ ఉన్న మరికొన్ని రాళ్లను నిశితంగా పరిశీలించిన పోలీసులు అవి చిత్రానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నవారికే హెచ్చరికలు అని తేల్చారు.  ‘‘చేతన్‌ చంపబడ్డాడు. మేం అల్లా మనుషులం. నిరసనలు చేసే వారి దిష్టిబొమ్మలను కాదు.. వారినే వేలాడదీస్తాం’’.. ఇలాంటి రాతలు ఉన్న రాళ్లు పోలీసుల కంటపడ్డాయి. 

దీంతో ఇప్పుడు దీని వెనుక మత ఘర్షణలు ఉన్నాయా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  మరో రెండు రాళ్లపై కఫీర్‌, మరికొన్ని రాతల్లో అల్లా పదం కనిపించటంతో అవి మరింత బలపడుతున్నాయి.   తమను బెదిరించడానికే ఆ రాతలు రాశారని శ్రీ రాజ్‌పుత్‌ కర్ణిసేన ఆరోపించిన విషయం తెలిసిందే. పద్మావతి సినిమాతో సైనీ మరణానికి ఎలాంటి సంబంధం లేదని మృతుడి సోదరుడు చెప్పగా.. ఇది మతపరమైన హత్య అని ఇప్పుడే ఓ నిర్ధారణకు రావటం అంత మంచిది కాదని యోచిస్తున్న పోలీసులు మిస్టరీని ఛేదించే పనిలో తలమునకలై ఉన్నారు.

మరిన్ని వార్తలు