ఆడుకుంటూనే.. పోయింది!

11 Nov, 2019 10:59 IST|Sakshi
ఇద్దరి అక్కల మధ్యన చిన్నారి వర్షిత (ఫైల్‌) నిందితుడి వెంట వెళుతున్న వర్షిత (సీసీ ఫుటేజీ)

కురబలకోట :  మానవ మృగం చేతిలో బలైన చిన్నారి వర్షిత (6) ఆడుకుంటూనే నిందితుడి వెంట వెళ్లింది. సీసీ కెమెరాల ఫుటేజిల్లో ఈ విషయం స్పష్టమైంది. మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి, రూరల్‌ సర్కిల్‌ సీఐ అశోక్‌ కుమార్, ముదివేడు ఎస్‌ఐ సుకుమార్‌ మరోసారి ఆదివారం కల్యాణ మండపం సీసీ కెమెరాల్లోని ఫుటేజీలను క్షుణ్నంగా పరిశీలించారు. సంఘటన జరిగిన రాత్రి 9. 54 గంటలకు నిందితుడి వెంట చిన్నారి వర్షిత ఎంతో సరదాగా  నడిచింది. ఏ మాత్రం బెరకు, భయం లేనట్లు సంతోషంగా వెళ్లడం సీసీ ఫుటేజీలో కనిపించింది. ఒక చోట వర్షితను నిందితుడు ఫొటో తీశాడు. ఆ తర్వాత నిందితుడి కంటే ముందుగా వర్షిత ఆడుకుంటూ.. మెల్లగా పరుగెత్తుకుంటూ వెళ్లినట్లు ఉంది.

చిన్నారి వెనక నిందితుడు వెళ్లినట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత చిన్నారి ఏ సీసీ కెమెరాలోను కనిపించలేదు. కొంత సేపటికే 10.15 గంటలకు నిందితుడిగా భావిస్తున్న ఒక్కడే తిరిగి కల్యాణ మండపంలోకి చేరుకున్నాడు. చేతిలో ఐస్‌క్రీమ్‌ ప్యాకెట్‌తో బయటకు వెళుతున్నట్లు కనిపించింది. అంతే ఇతను కూడా ఆ తర్వాత ఏ కెమెరాలోనూ రికార్డు కాలేదు. ఎంతో కాలంగా తెలిసిన వ్యక్తితో వెళ్లినట్లుగా చిన్నారి ఆడుకుంటూ నిందితుడి వెంట  ళ్లడం సీసీ ఫుటేజీల్లో చూసిన పోలీసుల కళ్లు సైతం చెమర్చాయి. సామాజిక  మాధ్యమంలో సీసీ ఫుటేజీని చూసిన వారిని చలింపజేస్తోంది. బంధుమిత్రులు ఇప్పటికీ తల్లడిల్లిపోతున్నారు. ఎంత ఘాతుకానికి పాల్డడ్డారని నిట్టూరుస్తున్నారు. 

478 మందికి పైగా విచారణ
సంఘటన జరిగినప్పటి నుంచి వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆరు టీమ్‌లు విచారణ జరుపుతున్నాయి. ఆదివారం వరకు 478 మందిని విచారించినట్లు చెబుతున్నారు. ఏ మాత్రం క్లూ లభ్యం కాలేదు. ఆదివారం వాట్సాప్, ఫేస్‌బుక్కులో అనుమానితుడి ఊహాచిత్రాన్ని పోలీన ఓ యువకుడి ఫొటో హల్‌చల్‌ చేసింది. అయితే పెద్దతిప్పసముద్రం మండలంలోని ఓ కేసులో నిందితుడిగా అతన్ని గుర్తించారు. హర్షిత కేసుకు అతనికి సంబంధం లేదని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు