చెర్లోపల్లె హైస్కూల్లో న్యూ ఇయర్‌ చిందులు

4 Jan, 2020 09:57 IST|Sakshi
హైస్కూల్లో వివాదానికి కారణమైన రికార్డింగ్‌ డ్యాన్సులు

సోషల్‌ మీడియా పోస్టింగులతో రచ్చ..రచ్చ!

రికార్డింగ్‌ డ్యాన్సులు నిర్వహించారని హెడ్మాస్టర్‌పై కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు

కక్ష సాధిస్తున్నారంటూ పోలీసులకు హెడ్మాస్టర్‌ కోటేశ్వరరావు ఫిర్యాదు

చిత్తూరు, గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె జెడ్పీ హైస్కూల్‌ వివాదం కాస్త రచ్చకెక్కింది. డిసెంబర్‌ 31న రాత్రి హైస్కూల్లో రికార్డింగ్‌ డ్యాన్సు కార్యక్రమం నిర్వహించడంతో పాటు పలు అసాంఘిక కార్యకలాపాలు జరిగాయంటూ హెడ్మాస్టర్‌పై కొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు– హెడ్మాస్టర్‌..కొందరు తనపై కక్ష కట్టి, వేధించడంతోపాటు, విధులకు భంగం కలిగిస్తున్నారంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పరస్పరం ఫిర్యాదులతో ఈ ఉదంతం మరింత వేడెక్కింది. వివరాలు..స్థానిక జెడ్పీ హైస్కూల్లో గత ఏడాది డిసెంబర్‌ 31న రాత్రి పెద్ద ఎత్తున డీజే(రికార్డింగ్‌ డ్యాన్సులు) నిర్వహించారు. యూత్‌ అంతా డ్యాన్సులతో చిందులేశారు.  పవిత్రమైన పాఠశాలల్లో అర్ధరాత్రి వరకు ఇలాంటి కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారంటూ కొందరు అడ్డుకోవడంతో అప్పట్లో వాగ్వాదానికి దారితీసింది. ఈ ఘటనపై కొందరు సోషియల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారు.

అంతేకాకుండా హెడ్మాస్టర్‌ హైస్కూల్లో అనైతిక కార్యకలాపాలకు రూములు ఇస్తున్నాడని, గతంలోనూ విద్యార్థులచేత పలు చేయరాని పనులు చేయించారని, కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా హైస్కూల్‌ను మద్యం సేవించడానికి, రికార్డింగ్‌ డ్యాన్సులకు, జూదం నిర్వహించుకోవడానికి ఇచ్చారని ఆరోపిస్తూ కొందరు గ్రామస్తులు ఇటీవలే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదలా ఉంచితే, కొంత కాలంగా హైస్కూల్లో కొందరు ఉపాధ్యాయుల విధులకు భంగం కలిగిస్తుండడంతో పాటు తమను అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారని పేర్కొంటూ హెడ్మాస్టర్‌ కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై కొందరు నాయకులు అసభ్యకరమైన పోస్టింగ్‌లు సామాజిక మాధ్యమాల్లో పెట్టారని, గత నెల 31న తాను సెలవుపై వెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు ఆకతాయిలు ప్రహరీ గోడపై కూర్చుని అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారని, వీరికి కొందరు నాయకులు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. పాఠశాల విద్యాకమిటీ ఎన్నికలు నిర్వహించినప్పటి నుంచి కొందరు తమపై కక్షగట్టారని, ఈ సంఘటనపై విచారణ చేసి నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

కేసు నమోదు చేశాం
హైస్కూల్‌ వివాదంపై హెడ్మాస్టర్‌ ఫిర్యాదు మేరకు  రెడ్డిరాజా అనే వ్యక్తిపై ప్రస్తుతానికి కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నాం. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. గ్రామస్తులు, విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను కూడా విచారణ చేస్తాం. ఇందులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉంటే వారిపై కూడా కేసులు నమోదు చేస్తాం.– చిన్నరెడ్డెప్ప, ఎస్‌ఐ, గుర్రంకొండ

మరిన్ని వార్తలు