కన్నతల్లే కఠినాత్మురాలై..

14 Dec, 2019 11:37 IST|Sakshi
ఘటనపై స్థానికులను విచారిస్తున్న పోలీసులు, ఆరోగ్య, అంగన్‌వాడీ సిబ్బంది

గర్భంలోనే చిన్నారి మృతి

నవజాత శిశువును డ్రెయిన్‌లో  పడవేసిన వైనం

విచారణ చేపట్టిన పోలీసులు, వైద్యసిబ్బంది

నిడదవోలు రూరల్‌: పసికందును కన్నతల్లే మురుగు డ్రెయిన్‌లో పడవేసిన విషాదఘటన నిడదవోలు మండలం కాటకోటేశ్వరంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం కాటకోటేశ్వరం గ్రామానికి చెందిన 18 ఏళ్ల ఓ యువతి ఈ ఘాతుకానికి పాల్పడింది. పెళ్లి కాకుండానే గర్భిణి అయిన ఈ యువతి గురువారం అర్ధరాత్రి ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆ పసికందు గర్భంలోనే మృతిచెందడంతో డ్రెయిన్‌లో పడవేసినట్లు తెలిసింది.

స్థానికులు శుక్రవారం ఉదయం మురుగు డ్రెయిన్‌లో ఉన్న శిశువును చూసి పంచాయతీ, పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఆరోగ్య, అంగన్‌వాడీ సిబ్బంది ఇంటింటా సర్వే చేసి అనారోగ్యంతో ఉన్న ఆ యువతిని గుర్తించి నిలదీయడంతో జరిగిన విషయం చెప్పింది. తాడిమళ్ల పీహెచ్‌సీ వైద్యాధికారి సుధీర్‌కుమార్‌ పర్యవేక్షణలో నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి యువతికి వైద్యపరీక్షలు చేశారు. యువతి సమాచారం మేరకు సమిశ్రగూడెం ఎస్సై టీవీ సురేష్‌ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

పనులకు వెళ్లి పరిచయం పెంచుకుని..
యువతితో పాటు ఆమె తండ్రి ఇద్దరూ కలిసి ఈ ఏడాది జనవరిలో జంగారెడ్డిగూడెం మండలంలో పొగాకు నారుమడుల పనికి వెళ్లారు. వారికి బంధువైన చాగల్లు మండలం ఊనగట్ల గ్రామానికి చెందిన యువకుడితో ఈమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకోవడంతో గర్భం దాల్చినట్లు పోలీసులు చెబుతున్నారు. తనకు గర్భం వచ్చిందని తెలియదని ఆ యువతి చెప్పినట్లు తెలుస్తోంది.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా