విషాదం : నవ దంపతుల ఆత్మహత్య

19 Feb, 2020 10:20 IST|Sakshi
ఆలకుంట్ల స్వామి మృతదేహం

పురుగుల మందు తాగిన భార్యాభర్తలు

అక్కడికక్కడే భర్త.. చికిత్సపొందుతూ భార్య మృతి

పెద్దలు ప్రేమను అంగీకరించక పోవడమే కారణం

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం

సాక్షి, భువనగిరి : నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగుల మందు తాగి అఘాయిత్యానికి ఒడిగట్టడంతో అక్కడికక్కడే భర్త మృతిచెందగా భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణా లు విడిచింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట్ల అంజయ్య–మంగమ్మలకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు ఆలకుంట్ల స్వామి(24) ప్రస్తుతం ఘట్‌కేసర్‌ మండలం అనోజీగూడలో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన శివరాత్రి ఉమారాణి తన కుటుంబ సభ్యులతో కలిసి పటాన్‌చెరువులో ఉంటుంది. స్వామి, ఉమారాణి ఇద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 16న ఇద్దరు కలిసి ఇంటినుంచి వెళ్లి పోయారు.

బీబీనగర్‌ మండలంలోని కొండమడుగు గ్రామంలో ఉన్న ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించాలని అదే రోజు ఘట్‌కేసర్‌లోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు విన్నవించారు. ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. సోమవారం రాత్రి భువనగిరి పట్టణ శివారులో ఉన్న డాల్ఫిన్‌ హోట ల్‌కు వచ్చి ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. మంగళవారం ఉదయం గది నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో హోటల్‌ సిబ్బంది తలుపులు తీసుకొని లోపలికి వెళ్లి చూడగా ఇద్దరు పురుగులు మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే 108కి, పోలీస్‌లకు సమాచారం అందజేశారు. ఇద్దరిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే స్వామి మృతిచెందాడు. ఉమారాణి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. విషయం తెలుసుకున్న బంధువులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పట్టణ పోలీసులు తెలిపారు. 

     

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు