ట్రాక్టర్‌ అదుపు తప్పి యువకుడి మృతి

29 Jun, 2019 12:07 IST|Sakshi
దేవి విక్రం (ఫైల్‌)

సాక్షి, కొండపాక(గజ్వేల్‌): ట్రాక్టర్‌ అదుపు తప్పి బావిలో పడిన యువకుడు మృతి చెందిన సంఘటన కొండపాక మండలం లకుడారం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.  దీనిపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దేవి ధర్మయ్య – యాదవ్వల రెండో కుమారుడు  దేవి విక్రం (27) దినచర్యలో భాగంగా గురువారం సొంత ట్రాక్టరును గ్రామ శివారులో ఓ రైతు పొలం దున్నుడానికి వెళ్లాడు.

 రాత్రి ఇంటికి తిరుగు ప్రయాణంలో అడవి పందులు అడ్డంగా రావడంతో తప్పించబోయిన క్రమంలో ట్రాక్టరు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయిందని తెలిపారు. దీంతో డ్రైవింగ్‌ చేస్తున్న దేవివిక్రం బావిలో పడి అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు.   

పది రోజుల క్రితమే పెళ్లి..
లకుడారం గ్రామానికి చెందిన దేవి విక్రం తండ్రి ధర్మయ్య గత రెండేళ్ల కిందట మృతి చెండదంటో తల్లి యాదవ్వకు సేవ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. విక్రంకు పది రోజుల కిందట మర్కుక్‌ మండలంలోని ధామర కుంటకు చెందిన భవితతో వివాహం జరిగింది. దీంతో గ్రామంలో విశాధచ్చాయలు అలుముకున్నాయి.

ప్రభుత్వం మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్‌ కందూరి కనుకవ్వ–ఐలయ్య కోరారు. ఈ విషయమై మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు కుకునూరుపల్లి పోలీసులు తెలిపారు.  

మరిన్ని వార్తలు