పెళ్లయిన నాలుగు నెలలకే..

17 Dec, 2018 12:08 IST|Sakshi
సంధ్య మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు(ఇన్‌సెట్‌) మృతి చెందిన సంధ్య(ఫైల్‌)

వివాహిత ఆత్మహత్య

వరకట్న వేధింపులే కారణం పరారైన భర్త

భర్త ఇంటిని ధ్వంసం చేసిన మృతురాలి బంధువులు

చిత్తూరు, కుప్పంరూరల్‌ : వరకట్న వేధింపులు తాళలేక పెళ్లయిన నాలుగు నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుప్పం మండలం పైపాళ్యం గ్రామంలో చోటుచేసుకుంది. కుప్పం పోలీసుల కథనం మేరకు.. పైపాళ్యం పంచాయతీ కంసలవానికుంట గ్రామానికి చెందిన సంధ్య(18), పైపాళ్యం గ్రామానికి చెందిన వేలు నాలుగు నెలల క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. ఇద్దరి కులాలు ఒక్కటి కావడంతో పెద్దలు ఒప్పుకున్నారు. వీరిద్దరు పైపాళ్యంలో కాపురం ఉంటున్నారు. వివాహం జరిగినప్పటి నుంచి వీరిద్దరి మధ్య సఖ్యత కుదరలేదు. కట్నంకోసం వేలు తరచూ సంధ్యను వేధిస్తుండేవారు. ఈ క్రమంలో గత గురువారం ద్విచక్రవాహనం, రూ.50 వేలు నగదు తేవాలని ఆమెను వేధించాడు. దీంతో సంధ్య చేసేది లేక ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.

కుటుంబ సభ్యులు గుర్తించి కుప్పంలోని ఓ ప్రైవేట్‌ నర్సింగ్‌ హోం తీసుకెళ్లి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు మెరుగైన వైద్యంకోసం తిరుపతికి తీసుకెళ్లమని సూచించారు. ఆదివారం సంధ్యను తీసుకుని భర్త తిరుపతికి బయలుదేరాడు. మార్గంమధ్యలో సంధ్య మృతిచెందింది. మృతదేహాన్ని తిరిగి పైపాళ్యం తీసుకువచ్చారు. గ్రామానికి రాగానే భర్త వేలు అంబులెన్స్‌ నుంచి దూకి పరారయ్యాడు. విషయాన్ని తెలుసుకున్న సంధ్య బంధువులు పైపాళ్యం గ్రామానికి వచ్చి వేలు ఇంటిని ధ్వంసం చేశారు. పక్కనే ఉన్న గడ్డివామికి నిప్పంటించారు. విషయం తెలుసుకున్న కుప్పం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఫైర్‌ ఇంజిన్‌తో గడ్డివామి మంటలను ఆర్పారు. మృతురాలి సంధ్య తల్లిదండ్రులు కళావతి, మునిక్రిష్ణన్‌ ఫిర్యాదు మేరకు వరకట్నం వేధింపుల కేసు నమోదు చేసి దరా>్యప్తు చేస్తున్నట్లు అర్బన్‌ సీఐ జీటీ.నాయుడు తెలిపారు. కాగా, మృతదేహాన్ని పరీక్షల అనంతరం ఆదివారం సాయంత్రం బంధువులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు